రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో స్కాం జరిగినట్లు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డీల్‌లో భారత్‌కు చెందిన మధ్యవర్తికి భారీగా ముడుపులు ముట్టినట్లు ఫ్రెంచ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ ‘మీడియా పార్ట్’ బయటపెట్టింది. మధ్యవర్తికి దాదాపు రూ.9 కోట్లను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఫ్రెంచ్ సంస్థ డెసాల్ట్ గ్రూప్ అంగీకరించినట్లు సమాచారం. 2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య ఈ డీల్ కుదిరింది. ఇక మధ్యవర్తికి రూ.4.12కోట్లు (508,925 యూరోలు) చెల్లించి, గిఫ్ట్ కింద అకౌంట్స్‌లో డెసాల్ట్ గ్రూప్ సంస్థ రాసుకుంది. 2018లో ఆ సంస్థలో జరిగిన ఆడిటింగ్ సమయంలో ఈ విషయం బయటపడింది. అయితే మిగతా డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉందట. ఇదొక ఆర్థిక నేరమని ‘మీడియా పార్ట్’ సంస్థ అభిప్రాయపడింది. అయితే రాఫెల్ డీల్‌లో ఎలాంటి స్కాం జరగలేదని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేయగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ తాజా వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
ఈ వివాదాస్పద ఇండో-ఫ్రెంచ్ రాఫెల్ డీల్‌పై మూడంచెల విచారణ కొనసాగుతుందని ఫ్రెంచ్ అవినీతి నిరోధక విభాగం ప్రకటించింది. మొదట 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ 7.8 బిలియన్లు ఖర్చు చేసేందుకు అంగీకరించింది. అందులో కొన్ని విమానాలు ఇప్పటికే భారత్ చేరాయి.