తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.. పార్టీ మారిన నేతలపై సీబీఐ కేసులు పెట్టాలని… పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలని రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు దాసోజు శ్రవణ్ ప్రదర్శించారు.
ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారితే.. వాళ్లను ఉరి వేసేలా చట్టాలు రావాలని రేవంత్ రెడ్డి మీడియా సాక్షిగా గాంధీ క్యాప్ ధరించి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారెవరైనా పార్టీ మారాలని ప్రయత్నిస్తే చావుదెబ్బ కొట్టి చంపుతామని కోమటిరెడ్డి అన్నారు. వీరిద్దరూ ఇంత పెద్ద ఎత్తున చిలుకపలుకలతో ప్రజలను నమ్మించి మోసం చేశారు.” అని అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దానం నాగేందర్‌ను పార్టీలో జాయిన్ చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసి రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తారని వార్నింగ్ ఇచ్చారు.