ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘నో టైమ్ టు డై’ చిత్రం విడుదలయింది. బాండ్ చిత్రాల్లో ఇది 25 వది కావడం విశేషం. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ అతను నటించిన చివరి బాండ్ మూవీ కావడం విశేషం.
కథగా చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. ఓ ప్రైవేట్ లేబోరేటరీలోని బయో వెపన్ ను స్పెక్టర్ ముఠా దొంగిలిస్తుంది. దానిని ఉపయోగించి ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలన్నది సాఫిన్ కోరిక. ఐదేళ్ళుగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న జేమ్స్ బాండ్ ను బయో వెపన్ ఆచూకీ తెలుసుకోవాల్సింది అధికారులు కోరతారు. సాఫిన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, అతనుండే ఐలెండ్ కు బాండ్ చేరుకుని, దాన్ని ధ్వంసం చేయడంతో సినిమా ముగుస్తుంది. ఇది బాండ్ గా డేనియల్ క్రేయిగ్ చేసిన చివరి చిత్రం కావడంతో, ఆ పాత్రను చంపేసి దర్శకుడు క్యారీ జోజి ఫుకునాగా విషాదకరమైన ముగింపును ఇచ్చాడు.
నిజానికి జేమ్స్ బాండ్ మూవీగా దీనిని భావించడానికి మనసు ఒప్పుకోదు. బాండ్ మూవీస్ లో ఉండే గ్రాండియర్, ప్రొడక్షన్ వాల్యూస్, టెంపో, రోమాంచితమైన యాక్షన్స్ సీన్స్ ఇందులో చెప్పుకోదగ్గట్టు లేవు. సినిమా ప్రారంభంలో వెస్పర్ లిండ్ సమాధి దగ్గర జరిగే యాక్షన్ సీన్ కాస్తంత మెప్పిస్తుంది. బాండ్ వాడే కారులో ఉండే సరికొత్త టెక్నికల్ ఫీచర్స్ ను ఈ ఎపిసోడ్ లో మరోసారి చూపించారు. ఇక ఆ తర్వాత సినిమాలో వచ్చే మూడు నాలుగు పోరాట దృశ్యాలూ పెద్దంతగా ఆకట్టుకోవు. ఈ సినిమాలో విలన్ పాత్ర బలంగా లేకపోవడం మెయిన్ మైనస్. ఇక క్లయిమాక్స్ మరీ బలహీనంగా ఉండటం, మూవీ రన్ టైమ్ కూడా రెండున్నర గంటలకు పైగా ఉండటంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. బాండ్ కు ఉండే ఇమేజ్ ను పట్టించుకోకుండా, అనేకానేక సందర్భాలలో దర్శక రచయితలు పలచన చేయడం బాగోలేదు. ఏదేమైనా బాండ్ చిత్రాల మీద, డేనియల్ క్రేయిగ్ మీద అభిమానం ఉన్నవారు ఓసారి చూడొచ్చు.
ఇది కూడా చదవండి: BB5: లహరి ఎంత పారితోషికం తీసుకుందంటే..?