బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లో మరోసారి మహమ్మారి కోరలు చాచుతోంది. కొవిడ్ కొత్త వేవ్ కారణంగా గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి ఈ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశముందని అంటున్నారు. ఒమిక్రాన్ XBB వేరియంట్ కారణంగా చైనాలో ఏప్రిల్ నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే చివరి నాటికి వారానికి 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశముందని స్థానిక వైద్య నిపుణులు చెప్పినట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక జూన్ చివరి నాటికి వారానికి 6.5కోట్ల మంది వైరస్ బారిన పడే ప్రమాదమున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2022 డిసెంబరులో చైనా జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు వైరస్ కొత్త వేవ్‌లు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఉద్ధృతి కనిపించడం ఇప్పుడేనని డ్రాగన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా వైరస్ ఉద్ధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్‌ను మరింత వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఒమిక్రాన్ XBB వేరియంట్ల ను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షాన్ చెప్పిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయనున్నారు..