Friday, September 20, 2024

TG | నీటి నిల్వతోనే బ్యారేజీలకు నష్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ బహిరంగ విచారణ మొదలుపెట్టింది. తొలిరోజు శుక్రవారం ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు, రీసెర్చ్‌ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు హాజరయ్యారు. మోడల్‌ స్టడీస్‌ కండక్ట్‌ చేశారా లేదా అని రీసెర్చ్‌ ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది.

నిర్మాణానికి ముందు, మధ్య, ఆ తర్వాత మోడల్స్‌ చేపట్టినట్టు తెలిపారు. మోడల్‌ స్టడీస్‌ పూర్తి కాకముందు నిర్మాణం మొదలైనట్టు అంగీకరించారు. ప్రాజెక్టు డ్యామేజ్‌ వెనుక నీళ్లను స్టోరేజ్‌ చేయడమే కారణమని ప్రస్తావించారు. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్‌ అధికారులునిర్లక్ష్యం వహించడమే దీనికి కారణంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మోడల్‌ స్టడీస్‌ తర్వాత పలు రకాల మార్పులు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారట. నీటిని స్టోరేజ్‌ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది కమిషన్‌. నిబంధనల ప్రకారమే పని చేశామని ఇంజనీర్లు అన్నట్లు తెలుస్తోంది.

2016 నుంచి 2023 వరకు మోడల్‌ స్టడీస్‌ చేసినట్టు రీసెర్చ్‌ ఇంజనీర్లు తెలిపారట. కమిషన్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారులు తడబడినట్లు అంతర్గత సమాచారం. దానికి సంబంధించి కొన్ని డీటేల్స్‌ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కమిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ చంద్రఘోష్‌ ఒకొక్కరిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు.

గత నెలలో 15 మందిని విచారించింది కమిషన్‌, అఫిడవిట్‌ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిపై కమిషన్‌ విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా విచారణ కమిషన్‌ ఎదుట హాజరైన ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ ఇంజనీర్లు కీలక అంశాలను వెల్లడించారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్‌ వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసి వివరాలను ధృవీకరించుకుంది.

- Advertisement -

ఆనకట్టల రీసెర్చ్‌ జరుగుతుండగానే నిర్మాణాలు చేశారని ఇంజనీర్లు కమిషన్‌కు వెల్లడించారు. నిర్మాణానికి ముందు, మధ్యలో ఒకసారి, ఆ తర్వాత కూడా మోడల్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. మోడల్‌ స్టడీస్‌ పూర్తికాక మునుపే నీటిని భారీగా నిల్వ చేశారని, ఈ కారణంగానే మేడిగడ్డతోపాటు, ఇతర ఆనకట్టల్లో సమ్యలు వచ్చాయని వారు నాటి వివరాలను కమిషన్‌ ఎదుట ఉంచారు.

వరద తీవ్రంగా ఉన్నప్పుడు కూడా గేట్లను ఎత్తకుండా నీటిని నిల్వ చేశారని, ఒత్తిడి పెరగడం కూడా కారణమని వెల్లడించారు. మోడల్‌ స్టడీస్‌ తర్వాత బఫెల్‌ బ్లాక్‌లో మార్పులు, సవరణలపై ప్రభుత్వానికి నివేదించిన విషయాలను గుర్తు చేశారు. బ్యారేజీలలో సమస్యలకు, మోడల్‌ స్టడీస్‌కు సంబంధంలేదని తెలిపారు. నిర్దేశిత నిబంధనల ప్రకారమే టీఎస్‌ఈఆర్‌ఎల్‌ పనిచేసినట్లుగా ఇంజనీర్లు తెలిపారు.

లొకేషన్‌, సీడీఓ అథారిటీ నివేదికల ఆధారంగా రీసెర్చ్‌ చేశామని, మొత్తం మూడు బ్యారేజీలలో 2016నుంచి 2023 వరకు రీసెర్చ్‌ టీం ఆధ్వర్యంలో మోడల్‌ స్టడీస్‌ జరిగినట్లు వివరించారు. కాగా అనేక అంశాలపై కమిషన్‌ ప్రశ్నలకు రీసెర్చ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ తమకేమీ తెలియదని తడబడుతూ సమాధానాలిచ్చినట్లు తెలిసింది. కమిషన్‌ ఎదుట సమాధానాలు ఇచ్చే తీరు ఇది కాదని కమిషన్‌ తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.

పనిచేసిన సమయంలో ఏం గుర్తుందో అది స్పష్టంగా చెప్పాలని కోరగా, చాలా విషయాలు గుర్తులేవని, మర్చిపోయానని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నివేదిక సమర్పించాలని ఎన్‌డీఎస్‌ఏకు కమిషన్‌ లేఖ రాసింది. అదే విధంగా జస్టిస్‌ పి.సి. ఘోష్‌ కమిషన్‌ అడిగిన లాయర్‌ను కేటాయించేందుకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.

అయితే ఈ విచారణలో భాగంగా హాజరవుతున్న ప్రతి ఒక్కరి నుంచి అఫిడవిట్‌ రూపంలో కమిషన్‌ వివరాలు తీసుకుంటుంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 15 మందికిపైగా అధికారులను ఈ కమిషన్‌ విచారించింది. ఈ సందర్భంగా వారి స్టేట్‌మెంట్‌లను జస్టిస్‌ చంద్ర ఘోష్‌ కమిషన్‌ రికార్డు చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

అయితే గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్‌లోని కొన్ని పిల్లర్లు కుంగాయి. దీంతో వేల కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ నాణ్యతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement