అన్ని రంగాలలో అణగారిపోయిన దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి బృహత్తరమైన, విప్లవాత్మకమైన పథకం ఇప్పటివరకు మన తెలంగాణలో తప్ప ఈ భూమ్మీద మరెక్కడా లేదన్నారు. ఈ పథకం అమలు విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని, ఎవరూ అయోమయానికి, గందరగోళానికి గురికావొద్దని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ యజ్ఞం మాదిరిగా దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లకు సంబంధించి మొత్తం 11వేల 500పూర్తి కాగా, మిగిలిన 335యూనిట్ల గ్రౌండింగ్ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందన్నారు. నియోజకవర్గానికి 1500 యూనిట్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని, వచ్చే ఎనిమిదేళ్లలో మొత్తం 17లక్షల ఎస్సీ కుటుంబాలకు ఈ పథకం అందుతుందన్నారు. వారి జీవితాలలో వెలుగులు ప్రసరిస్తాయని మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.