కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగుల డీఏ 50 శాతానికి చేరింది. పెంచిన డీఏ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. వచ్చే నెల జీతంతో పాటు బకాయిలను కేంద్రం చెల్లించనుందని తెలిపారు.
గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ స్కీమ్ పొడిగింపు..
మరోవైపు.. కేబినెట్ కీలక నిర్ణయాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 సబ్సిడీ పథకాన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా కేంద్రంపై అదనంగా మరో రూ.12 వేల కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరోవైపు.. 2024-25 సీజన్ కి సంబంధించి జూట్ కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపారు. క్విటాలుకు రూ.285 పెంచినట్లు తెలిపారు. దీంతో క్విటాలు జూట్ ధర రూ. 5,335కు చేరింది.