Friday, November 22, 2024

Cyclone – రెమాల్ తుపాన్ విధ్వంసం … ఈశాన్య రాష్ట్రాల్లో ఆగం ఆగం..38 మంది మృతి

బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లోనూ విధ్వంసం సృష్టించింది. తుపాన్ ధాటికి 38మంది మ‌ర‌ణించ‌గా, వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు.. వేలాదిమంది నిరాశృయల‌య్యారు.. కాగా, ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం ప్రభుత్వం తెలిపింది. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ కూలి 17 మంది చ‌నిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండచరియలు ఇళ్లపై కూలి 10 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. గ్రానైట్‌ క్వారీ నుంచి 17 మృతదేహాలను వెలికితీసినట్లు మిజోరం డీజీపీ అనిల్‌ శుక్లా తెలిపారు. మరో 6, 7 మంది అందులో చిక్కుకున్నట్లు భావిస్తున్నామన్నారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం..

- Advertisement -

భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని, రాష్ట్రంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మిజోరాం సీఎం సంతాపం వ్యక్తం చేస్తూ పరిహారం ప్రకటించారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధికి ముఖ్యమంత్రి రూ.15 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.

మేఘాల‌య‌లోనూ ఇద్ద‌రు మృతి

మేఘాలయలో భారీ వర్షం కారణంగా ఇద్దరు మృతి చెందగా, 500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు జైంతియా హిల్స్‌లో కారు ప్రమాదంలో ఒకరు, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదాపు 17 గ్రామాలకు నష్టం వాటిల్లిందని, చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక పేర్కొంది.

అసోంలో ఇద్ద‌రు

అసోంలో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. రెమాల్ తుపాను ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా మంగళవారం అసోంలో భారీ నష్టం జరిగింది.

కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు.. ఆరుగురు మృతి

కేరళ రాష్ట్రాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ద‌క్షిణ త‌మిళ‌నాడులో ఏర్ప‌డిన తుపాన్ కార‌ణంగా రెండు రోజుల పాటు కేర‌ళ‌లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురిశాయి. దీంతో వేర్వేరు ఘ‌టన‌ల్లో ఆరుగురు మృతి చెందారు. తిరువనంతపురం ముతలాపోజి హార్బర్‌ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడటంతో అంచుతెంగుకు చెందిన మత్స్యకారుడు అబ్రహం (60) మరణించాడు. ఇడుక్కిలోని మరయూర్‌ సమీపంలో పాంబర్‌కు చెందిన 57 ఏళ్ల రాజన్‌ చేపలు పట్టుకుంటున్న సమయంలో నదిలో పడి మరణించాడు. తిరువనంతపురంలోని అరువిక్కరకు చెందిన 56 ఏళ్ల అశోక్‌, కన్హంగాడ్‌కు చెందిన 14 ఏళ్ల సినాన్‌, పెరుంబవూరులో 10వ తరగతి విద్యార్థి ఎల్డోన్‌ నదిలోని మునిగి చనిపోయారు. మావేలికరకు చెందిన 31 ఏళ్ల అరవింద్‌ కొబ్బరి చెట్టు మీద పడి మరణించాడు. భారీ వర్షాల కారణంగా కొచ్చిలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భరణంగానం వద్ద కొండచరియలు విరిగిపడి ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement