Monday, November 18, 2024

Cyclone Dana | ఉత్తర వాయువ్య దిశగా దానా…

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాన్.. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. దీని కారణంగా ఒడిశా, తూర్పు ఆంధ్రా ప్రాంతాలలో ఈదురు గాలులతో కడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వైజాగ్, శ్రీకాకుళం, ఒడిశాలలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి.

వాయువ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ ఒడిశాలోని పారాదీప్‌కు 100 కిలోమీటర్లు, ధామ్రాకు 130 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాద్ తెలిపారు.

దానా తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోందని… ఉత్తర వాయువ్య దిశలో కదులుతున్న ఈ తుఫాన్ గురువారం (అక్టోబర్ 24) అర్ధరాత్రి, శుక్రవారం (అక్టోబర్ 25) ఉదయం మధ్య పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో 100 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. 20 సెంటీ మీటర్లకు మించి వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

దానా తుపాను ప్రభావంతో ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్, కేంద్రపాడ, కటక్, భద్రక్, జాజ్‌పూర్, బాలేశ్వర్, మయూర్‌భంజ్.. పూరీ, ఖుర్దా, కేంజర్, నయాగర్, ధెంకనల్ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించారు. శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement