అహ్మదాబాద్: అరేబియా సముద్రం నుంచి ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్ తీరంలో అధికారులు ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. దీనిలో గంగానే ద్వారక తీరంలోని ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని కోస్ట్‌గార్డ్ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎంతో సాహసోపేతంగా కోస్ట్‌గార్డ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
వివరాలలోకి వెళితే ద్వారక లోని ఓఖా తీరానికి 40 కి.మీల దూరంలో ఉన్న ‘కీ సింగపూర్’ ఆయిల్ రిగ్‌లో సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే తుపాను ప్రభావంతో వీరికి ముప్పు పొంచి ఉండటంతో వీరిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగింది. సోమవారం సాయంత్రం నుంచి నిరంతర ఆపరేషన్ చేపట్టి మంగళవారం మధ్యాహ్నాం వరకు మొత్తం 50 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. కోస్ట్‌గార్డ్‌కు చెందిన శూర్ వాహకనౌక, తేలికపాటి హెలికాప్టర్ ఎంకే-3 సాయంతో నిన్న 26 మందిని, నేడు 24 మందిని రక్షించినట్లు భారత తీర భద్రతాదళం వెల్లడించింది.
రాత్రంతా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం ఏడు సార్టీలు నిర్వహించి అధికారులు వీరిని కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కోస్ట్‌గార్డ్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. శూర్ నౌకపై హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి వీరిని తరలించారు.