Tuesday, November 26, 2024

డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ సబ్జెక్ట్‌! 2023-24 విద్యాసంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ మధ్యకాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరిద్దరూ ఎక్కడోచోట.. ఏదోరకంగా సోషల్‌ మీడియా వేదికగా మోసాలబారిన పడుతున్నవారే ఉన్నారు. ఆర్థిక మోసాలు, బ్లాక్‌మెయిలింగ్‌ నేరాలు చాలా పెరుగుతున్నాయి. దీంతో బాధితులు తమవారిక చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మోసాలు, నేరాలు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థి దశ నుంచే సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడం ద్వారా నేరాలను అదుపుచేయొచ్చనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటిపై విద్యార్థులకు అవగాహన పెంచేలా డిగ్రీ కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సేఫ్టీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీ, సైబర్‌ లాపై అవగాహనను కల్పించేలా డిగ్రీలో కొత్త సబ్జెక్టును తేనున్నారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో డిగ్రీలోని అన్ని గ్రూపుల్లో ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదివేలా ప్రవేశపెట్టనున్నారు. మొదటి సంవత్సరంలో ఒక్కో సెమిస్టర్‌కు రెండు క్రెడిట్‌లు ఉండనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ, సేఫ్టీ అంశంపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాఠ్యాంశం రూపకల్పనకు సంబంధించి 10 మంది నిపుణులతో కూడిన సిలబస్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.

విద్యార్థులు సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందకు వారిలో అవగాహనను కల్పించేలా ఈ కమిటీ సిలబస్‌ను రూపొందించనుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో తప్పనిసరిగా ఇదొక సబ్జెక్టును విద్యార్థులు చదివేలా యూనివర్సిటీ, కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా నేరాలను అదుపుచేయొచ్చని ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement