ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి… మరీ ముఖ్యంగా హ్యాకర్లు, సైబర్ నేరస్థులు క్రిప్టోకరెన్సీ దోచేస్తున్నారు.. చైనాలిసిస్ నివేదిక ప్రకారం.. 2023లో సుమారు 1.7 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీలు దొంగిలించారు.
భారత కరెన్సీలో ఈ విలువ రూ.14,130 కోట్లు దాటింది. అయితే, ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, క్రిప్టోకరెన్సీ దొంగతనాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 54.3 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దొంగతనాలు ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గాయి. కానీ సంఘటనల సంఖ్య పరంగా ఇది పెరిగింది. 2022 సంవత్సరంలో 219 క్రిప్టోకరెన్సీ దొంగతనం కేసులు నమోదు కాగా, 2023లో కేసుల సంఖ్య 231కి పెరిగింది. ఉత్తర కొరియాకు సంబంధించిన సంస్థలు గత ఏడాది క్రిప్టోకరెన్సీ దొంగతనాల్లో ఎక్కువగా పాల్గొన్నాయి. 2023లో ఉత్తర కొరియా సంస్థలు దాదాపు 20 కేసుల్లో చిక్కుకున్నాయి. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన దొంగతనాలకు పాల్పడ్డాయి. ఈ సైబర్ నేరాలు అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.