మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోని సైట్లను ఓపెన్ చేస్తున్న వారికి కేటుగాళ్లు వల వేసి దోపిడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన వివాహిత తన భర్త చనిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలని భావించి భారత్ మ్యాట్రిమోనీ సంస్థలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఇటీవల విజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. తాను మ్యాట్రిమోనీ సంస్థ వెబ్‌సైట్‌లో వివరాలు చూశానని, తాను డాక్టర్‌ను అని, ఇటలీలో స్థిరపడి అక్కడే సొంతంగా క్లినిక్ కూడా నిర్వహిస్తున్నానని చెప్పాడు. మీకు అంగీకరమైతే పెళ్లి చేసుకుందాం’ అని ముగ్గులోకి దింపాడు. అతడి మాటలు నమ్మిన మహిళ వివాహానికి అంగీకరించింది. నెల రోజుల్లో ఇండియాకు శాశ్వతంగా వస్తానని, ఈలోగా క్లినిక్ మూసివేసి, ఇక్కడ ఇంట్లో ఉన్న అత్యంత విలువైన వస్తువులు, సామగ్రి అంతా పంపిస్తానని, ఎయిర్‌పోర్టుకి రాగానే వెళ్లి వాటిని తీసుకుని ఇంటికి తరలించమని ఆమెకు చెప్పాడు. రెండు రోజుల క్రితం రుబీనాఖాన్ అనే యువతి ఫోన్ చేసి ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నానని, ‘మీకు వచ్చిన పార్సిల్ తీసుకోవాలంటే రూ.50లక్షలు ట్యాక్స్ చెల్లించాలి’ అని చెప్పడంతో బాధితురాలు ఆ మొత్తం బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని నిర్ధారించుకున్న మహిళ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.
‘