Friday, November 22, 2024

13వ తేదీన సీడబ్ల్యూసీ భేటీ, జి-23 నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు.. పార్టీ అధ్యక్షుడి అంశమూ చర్చించే చాన్స్

కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యుసీ) నేడు సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ఈ భేటీకి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిని విశ్లేషించుకోవడంతోపాటు, నూతన అధ్యక్షుడి ఎంపిక గురించి ప్రముఖంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు, 23 మంది ఇతర సభ్యులు, ఏఐసీసీ ఎన్నుకున్న 12 మంది సమావేశంలో పాల్గొంటారు. గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా సీడబ్య్యూసీ భేటీ జరిగింది. అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ ఓటమి అంశమే భేటీలో కీలక అజెండా అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడం, ఎమ్మెల్యేల సంఖ్య 80 నుంచి 18కి పడిపోవడం కాంగ్రెస్‌ను తీవ్రనిరాశకు గురిచేసింది.

ఉత్తరాఖండ్‌, మణిపూర్‌,గోవా రాష్ట్రాల్లో బీజేపీతో ముఖాముఖి పోటీ నెలకొన్నప్పటికీ ఆశించిన మేరకు ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గోవాలో విజయం తథ్యమని భావించిన కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. యూపీలో ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ ఇద్దరూ శ్రమించినప్పటికీ ఓట్లు, సీట్లు పెరగకపోగా మరింత తగ్గాయి. మరోవైపు జీ 23 నేతలు కూడా ఫలితాలపై తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓటమికి బాధ్యులెవరో తక్షణమే తేల్చాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జి23లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారి, గులాం నబీఆజాద్‌ శుక్రవారం ఢిల్లిలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో నేడు జరగనున్న సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement