అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా సాగుతున్న విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్‌కు విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్(ప్రివెంటివ్) అధికారులు మరోసారి చెక్ పెట్టారు. 2014లో విజయవాడలో కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ ఏర్పాటు తర్వాత విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్ తో పాటు దేశీయంగా తయారు చేస్తూ జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిసారించి కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విజయవాడకు కంటైనర్‌లో వచ్చిన రూ.3.45 కోట్ల విలువైన విదేశీ, సుంకం చెల్లించని స్వదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ కమిషనరేట్(ప్రివెంటివ్) ప్రిన్సిపల్ కమిషనర్ ఎస్.ఫహీం అహ్మద్ కథనం ప్రకారం.. బీహార్ రాజధాని పాట్నా నుంచి విజయవాడకు లారీలో మయన్మార్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న పారిస్ బ్రాండ్ సిగరెట్లతో పాటు దేశీయంగా తయారైన సుంకం చెల్లించని గోల్డ్ విమల్ బ్రాండ్ సిగరెట్లు రవాణా అవుతున్నట్లు నిర్థిష్టమైన సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జాతీయ రహదారిపై నిఘాను పటిష్టం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ-విశాఖపట్టణం జాతీయ రహదారిపై కేసరపల్లి సమీపంలో అనుమానాస్పద ట్రక్కును ఆపి తనిఖీ చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 156 హైడెన్సిటీ పాలిథిన్(హెచ్‌డీపీఇ) బస్తాల్లో సిగరెట్ కార్టన్లను పెట్టి కుట్టేసినట్లు గుర్తించారు.
264 కార్టన్‌లలో ప్యాకింగ్ చేసిన 26లక్షల 40వేల పారిస్ బ్రాండ్ సిగరెట్లు, 136 కార్టన్లలో ప్యాక్ చేసిన 16లక్షల 32వేల గోల్డ్ విమల్ బ్రాండ్ సిగరెట్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న విలువ రూ.3.45 కోట్లుగా అధికారులు నిర్థారించారు. ఈ మేరకు కస్టమ్స్ చట్టాల కింద స్మగ్లింగ్ సరుకుతో పాటు కంటెనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో యజమాని ఆదేశాల మేరకే లారీని విజయవాడ తీసుకొచ్చినట్లు డ్రైవర్ పేర్కొన్నారు. తదుపరి విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ సిగరెట్ల అక్రమ దిగుమతి వలన బ్లాక్ మార్కెటీర్లకు లాభాల పంట పండిస్తుండగా పేరొందిన బ్రాండెడ్ సిగరెట్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అటు కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు స్మగ్లర్లు పాల్పడుతుండగా స్వదేశీ బ్రాండ్ల అమ్మకాలు తగ్గి జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పైగా విదేశీ సిగరెట్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ విధమైన హెచ్చరికలు ఉండవని, అధిక మోతాదులో పొగాకు ధూళి ఉండటం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.