Friday, November 22, 2024

Big story | భూతాపం శాపం… 2060 వరకూ ఇంతే!

ప్రపంచమంతా తక్షణం అప్రమత్తమై.. చైతన్యవంతమై.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన కదిలితే… దాని ఫలితం రావడానికి కనీసం 40 ఏళ్లు పడుతుంది. ఇప్పటికప్పుడు ప్రభుత్వాలు కళ్లుతెరిచి కదం తొక్కితే.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే 2060 నాటికి చల్లని కబురు తెలుస్తుంది.అంతవరకు ఇప్పటిలా మండుటెండలు, అధిక ఉష్ణోగ్రతలు, కరువుకాటకాలు, వరదలు, ప్రకృతి విపత్తులు ఇప్పటికన్నా అధికంగా ఎదుర్కోక తప్పదు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక. గడచిన ఎనిమిదేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. 2022 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు నమోదు చేసింది. గడచిన కొన్ని దశాబ్దాలలో ఇది ఐదవ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరమట. పసిఫిక్‌ ప్రాంతంలో వరుసగా మూడో ఏడాది లా నినా పరిస్థితులు ఉత్పన్నమవడంతో ప్రపంచ దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.

తాజ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైెజేషన్‌) స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ క్లైమేట్‌ 2022 పేరిట 55 పేజీల నివేదికలో అనేక అంశాలను పేర్కొంది. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కాలుష్యం భూగోళంలోని వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రత్యేకించి కర్బన ఉద్గారాల విడుదల అసాధారణంగా ఉంటోంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచాన్ని కాపాడే హిమానీ నదాలు కరిగిపోవడం ఉధృతమైంది. ఫలితంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో వాతావరణాన్ని చల్లబరిచే ల నిన పరిస్థితులు వరుసగా మూడో ఏడాది (2022) ఏర్పడ్డాయి. దీని ప్రతికూల ప్రభావం చాలా దేశాల వాతావరణంపై ఉంటుంది. భయంకర వరదలు, కరువు, వడగాల్పులు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తున్నాయి. 2022లో ప్రపంచంలోని సముద్ర ఉష్ణోగ్రతలు, ఆవ్లుత ఎన్నడూ లేని స్థాయికి పెరిగాయి.

- Advertisement -

ప్రపంచంలోని సముద్ర వాతావరణంలో 58 శాతం మేర వడగాల్పులు వీచాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఫలితంగా అంటార్కిటకాలోను, యూరోపియన్‌ ఆల్ప్స్‌లోనూ మంచు గతంకన్నా చాలా తక్కువగా పేరుకుంది. గత జూన్‌, జులైల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. పనామా కాలువ లోతు కనిష్ట స్థాయికి చేరుకుంది. చైనా, ఐరోపా దేశాల్లో ఎన్నడూ లేనివిధంగా సుదీర్ఘకాలంపాటు వడగాల్పులు వీచాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఆఫ్రికాలో కరువు, పాకిస్తాన్‌లో నాలిగింట మూడొంతులు భాగం వరదల్లో చిక్కుకుపోగా 80 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గత ఏడాది ఈ విపరిణామాలను ప్రపంచం చూసింది. కోట్లాదిమంది నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్క సొమాలియా, ఇథియోపియాలోనే 17 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఫలితంగా వలసలు పెరుగుతున్నాయి. ఆహార భద్రత సవాలుగా మారింది. చైనాలో రికార్డు స్థాయిలో, కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. కొన్ని నెలలపాటు వడగాల్పులు వీచాయి. ఇది అసాధారణ వాతావరణ మార్పుగా ఆ సంస్థ పేర్కొంది.

కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. హిమానీనదాల కరుగుదలను, సముద్ర వాతావరణం మారిపోవడం నియంత్రించలేని స్థితికి చేరిపోయామని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. చరిత్రలో తొలిసారిగా హిమానీనదాల కరుగుదల అత్యధికంగా, ఒక్క ఏడాదిలో 1.3 మీటర్లు (51 అంగుళాల) గా తేలింది. ఫలితంగా 2013-2022 మధ్య సముద్రమట్టాలు 4.62 మిల్లిdమీటర్ల మేర పెరిగింది. 1990 నుంచి లెక్కగడితే 10 సె.మీ. మేర మట్టాలు పెరిగాయన్నమాట. ఇదే ఒరవడి కొనసాగితే ఈ శతాబ్దాంతానికి సముద్ర మట్టాలు 20 నుంచి 39 అంగుళాల మేర పేరుగుతాయి. మానవాళి మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకుని వాతావరణ సమతుల్యతను సాధించడానికి తక్షణం చర్యలు చేపడితే నలభై ఏళ్ల తరువాత సత్ఫలితాలు అందుతాయి. జి 7 దేశాలు అప్రమత్తమై పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేసి 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు తగ్గే లక్ష్యంతో చర్యలు తీసుకోవడం తక్షణ కర్తవ్యం. లేనిపక్షంలో 2023 – 2024లో ఎల్‌ నినో పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆ సంస్థ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement