హైదరాబాద్, ప్రభన్యూస్: గృహ వినియోగదారులకు 800 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు కేవలం 50 పైసలు మాత్రమే పెంచనున్నట్టు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి డిస్కంలు తెలిపాయి. అన్ని సర్వీస్ ఛార్జీలను కలుపుకొని 14శాతం పెంచడానికి టీఎస్‌ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇచ్చినప్పటికీ, వాస్తవ రూపంలో ఆ పెరుగుదల రెండింతలుగా ఉందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వీటికి తోడు అదనపు ఛార్జీల పెంపులో సైతం డిస్కంలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయని తెలుస్తోంది. రూ.15 వరకు స్థి ర ఛార్జీలు పెంచుతామని డిస్కంలు ఈఆర్సీకి తెలపగా రూ.10 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. అయితే చాలా స్లాబ్‌ల్లో స్థి ర చార్జీలను రూ.15 వరకు పెంచినట్టు సమాచారం. ఫిక్స్‌డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అదనపు ఛార్జీలు, టారీఫ్ డిఫరెన్స్‌ల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం కొత్త బిల్లులు మోత మోగిస్తున్నాయి.
విద్యుత్ బిల్లుల పెంపకంపై డిస్కంలు ప్రకటించిన టారీఫ్ కన్నా వాస్తవరూపంలో విద్యుత్ బిల్లులలో భారీ పెరుగుదల కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిస్కంలు మాత్రం తాము ఈఆర్సీకి ఆదేశాలకు అనుగుణంగానే పెంచామని చెబుతున్నప్పటికీ వివిధ సర్వీస్ ఛార్జీల అదనపు పెరుగుదల గురించి ప్రస్తావించడం లేదు. తక్కువ విద్యుత్ వాడుతున్న పేద మధ్యతరగతిపై ఈ పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టి లో పెట్టుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
కేటగిరి ఎల్టి -1 ప్రస్తుత ఛార్జీలు పెరిగిన ఛార్జీలు..
0-50 యూనిట్లు రూ.1.45 రూ.1.95
51-100 యూనిట్లు రూ.2.60 రూ. 3.10
కేటగిరి: ల్టి -1(బి1)
0-100 యూనిట్లు రూ.3.30 రూ.3.40
101-200 యూనిట్లు రూ.4.30 రూ. 4.80
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..