భారత్‌లో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2024 నాటికి దేశంలో 5జీ వినియోగదార్లు 15 కోట్లకు చేరొచ్చిన నోకియా నివేదిక అంచనా వేసింది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఏడాది అంతానికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. అందుబాటులోకి వస్తున్న 5జీ సేవలకు అనుగుణంగా నియోగదార్లు సైతం తమ పాత స్మార్ట్‌ఫోన్లను మార్చుకుని, కొత్తవి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి దేశంలో 15 కోట్ల మంది 5జీ వినియోగదార్లు ఉండే అవకాశం ఉందని నోకియా అంచనా.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది 5జీ వినియోగదార్లు ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో 4జీ, 5జీ చందాదార్ల సంఖ్య 90 కోట్లకు చేరుతుందని పేర్కొంది. అప్పటికీ 2జీ మొబైల్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 15 కోట్లకు పరిమితమవుతుంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 35 కోట్ల మంది 2జీ చందాదార్లు ఉన్నట్లు తెలిపింది. 2022 అక్టోబర్‌లో దేశంలో 5జీ సేవలు ప్రారంభం కాగా, 2023-24 చివరకు 10 కోట్ల మంది 5జీ వినియోగదార్లను చేర్చుకోవాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో భారత్‌కు 7కోట్ల 5జీ ఫోన్లు దిగమతయ్యాయని నోకియా నివేదిక పేర్కొంది.
73 కోట్ల యాక్టివ్ 4జీ వినియోగదార్లలో 8.5 కోట్ల మంది వద్ద 5జీ సేవలకు సరిపోయే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నెట్‌వర్క్ విస్తరించే కొద్దీ 5జీ స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. డేటా వినియోగం దేశంలో 5జీ ప్రవేశంతో మరింతగా పెరుగుతోందని నోకియా పేర్కొంది. 2027 నాటికి నెలకు ఒక్కో వినియోగదారుడు వినియోగించే సగలు డేటా 46 జీబీకి చేరవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఇది సుమారుగా 20 జీబీగా ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే దేశంగా భారత్ నిలుస్తోందని నోకియా పేర్కొంది.