Saturday, November 23, 2024

Big story : వైవిధ్య ఉద్యానవన పంటల సాగు.. 11 జిల్లాలు ఎంపిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రైతులను మేలైన, వైవిద్యమైన ఉద్యానవన పంటల సాగు దిశగా మళ్లేంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు రాష్ట్రంలోని 11 జిల్లాలను ఎంపిక చేసి అక్కడ మేలైన, కొత్తరకం కూరగాయలు, ఆకుకూరలు, పూల పంటను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రతి మండలానికి ప్రత్యేకంగా రెండు, మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడి రైతులు ఉద్యానవనశాఖ అందించిన కూరగాయలు, పూల వంగడాలను సాగు చేసేలా చర్యలు తీసుకుంటారు.

నూతన రకాల వంగడాలను మరో పంట కాలానికి రైతులు నిల్వ చేసుకునేలా, మార్పిడి చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉదాహారణకు రీసెర్చ్‌ ఫౌండేషన్‌ రకమైన బీర, చిక్కుడు, బీన్స్‌ తరహా వంగడాలను రైతులు పండించేలా ప్రోత్సహించనున్నారు. ఈ బీర, చిక్కుడు రకాలు సంవత్సరమంతా కాయడంతోపాటు చీడ, పీడలను, వాతావరణ మార్పులను తట్టుకుని నిలుస్తాయని, తెలంగాణ నేలలకు అనుకూలమైన పంట అని తెలంగాణ ఉద్యానవనశాఖ ప్రత్యేక ప్రధాన సైంటిస్టు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తం 26 రకాల కూరగాయలు, పూలు, పండ్ల తోటలను రైతులతో సాగు చేయించనున్నారు.

ఇందుకు మేలైన వంగడాలు రైతులకు అందేలా ఉద్యానవనశాఖ వ్యవసాయ పరిశోధనా సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు గాను 11 జిల్లాలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్‌ తదితర జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే వైవిధ్యమైన ఉద్యాన వన పంటల సాగు పథకం కింద సిద్ధిపేట జిల్లాలో ని ఒక గ్రామంలో అమలు చేస్తున్నారు. అక్కడ పండించే బీర సాగు కు చుట్టుపక్కల రైతులు కూడా ఆకర్షితులు కావడంతో మొదట 32 ఎకరాల్లో ప్రారంభమైన నూతన బీర వంగడం సాగు ఇప్పుడు ఆ జిల్లాల్లో పలు గ్రామాలకు విస్తరించిందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు.

వైవిధ్యమైన ఉద్యానవన పంటల సాగుకు ఎంపికైన 11 జిల్లాల్లో అధికారుల కొరత లేకుండా అన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారుల పాత్రే చాలా కీలకం. అధికారులు క్రమం తప్పకుండా వారి పొలాలకు వెళ్లి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. సబ్సీడీపై రైతులకు విత్తనాలను అందజేయడంతోపాటు పంట సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య మెళుకువలను వివరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement