Saturday, November 23, 2024

ఆక్వా రైతాంగం కష్టాల సాగు! పెరిగిన మేత ధరలు… తగ్గిన అమ్మకం ధరలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో ఏటా పది లక్షల మెట్రిక్‌ టన్నులుపైగా దిగుబడి సాగిస్తూ విదేశీ మార్కెట్లో సత్తా చాటిన ఘనచరిత క్రమంగా మసకబారుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహలేమి, రొయ్యల మేత ధరల పెరుగుదల, మార్కెట్‌లో ధర లేకపోవడం వంటి వరుస పరిణామాలతో ఆక్వా రంగం నష్టాల బాట పట్టింది. మేత, ప్రొ బయాటిక్స్‌ అరువు ఇచ్చేది లేదని రైతులకు వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు లక్ష ఎకరాల్లో అక్వాసాగు వుండగా వుభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికిపైగా రైతులు ప్రత్యక్షంగా, ప్రాసెసింగ్‌ యూనిట్లు-, ఎక్స్‌పోర్టర్స్‌, చిరు వ్యాపారులు మరో లక్ష మందికిపైగా ఈ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. రొయ్య పిల్లలు, విద్యుత్తు, డీజిల్‌ వంటి వాటిని రైతులు ముందుగానే నగదు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు.

రొయ్యల మేత, ప్రొ బయాటిక్స్‌, ఇతర మందులను దుకాణాల్లో అరువుకు తెచ్చుకుంటారు. పంట అమ్మిన తరువాత డబ్బులు చెల్లిస్తారు. ప్రస్తుతం ఆక్వా రంగం సంక్షోభంలో ఉండడంతో మేత దుకాణాల వ్యాపారులు ఈ నెల ఒకటి నుంచి అరువు ఇవ్వడం నిలిపేశారు. రాజకీయ పెద్దలు, పెద్ద రైతులకు మాత్రమే అరువు ఇస్తున్నాయి. చిన్న రైతులు పెట్టు-బడి పెట్టే స్థోమత లేక సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన నెల రోజుల్లో పది వేల ఎకరాల్లో పంటను మధ్యలోనే అమ్ముకున్నట్టు- సమాచారం. కొంతమంది రైతులు ఉన్న పంటతోనే సరిపెట్టు-కుని, మళ్లీ పంటకు రొయ్య పిల్లలను వేయడం లేదు. ఏటా ఈ సీజన్‌లో సీడ్‌ కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేవని, రైతులు సాగుకు ముందుకు రాకపోవటంతో అమ్మకాలు మందగించాయని హేచరీల నిర్వాహకులు చెబుతున్నారు.

వ్యాపారులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు సిండికేట్‌..

- Advertisement -

గతంలో వంద కౌంట్‌ రొయ్యల ధర కిలో రూ.220 వరకూ పలికేది. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.160 ఉంది. ప్రభుత్వం ఇటీవల మంత్రులతో కమిటీ వేసి వంద కౌంట్‌కు కిలో ఒక్కంటికీ రూ.230 ధర చెల్లించాలని నిర్ణయించింది. వ్యాపారులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు సిండికేట్‌గా మారడంతో ఈ ధర అమలు కావట్లేదు. ఎకరా రొయ్యల సాగుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఖర్చవుతోంది. గత నెల రోజులుగా రొయ్యలు కొనేందుకు ఎగుమతిదారులు ముందుకు రావట్లేదని, వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆక్వా రంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రంగం పట్ల ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి నష్టాల నుంచి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వంద శాతం ఫారిన్‌ ఎక్ఛ్సేంజ్‌కి అవకాశం ఉన్న ఆక్వా రంగం అభివృద్ధికి చొరవ చూపాలి. వంద కౌంట్‌ కేజీకి పెట్టు-బడి ఖర్చు రూ.300 అవుతోంది. మార్కెట్‌ ధర రూ.150 మించడం లేదు. ఎగుమతిదారుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. ఫీడ్‌ ధరలను అదుపు చేయాలి. మంచి సీడ్‌ అందించే విధంగా చర్యలు చేపట్టాలి. కరోనా వైరస్‌ విజృంభణ అనంతరం నెలకొన్న పరిస్థితుల నుంచి ఇప్పటికీ ఆక్వా రైతులు కోలుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement