అమరావతి, ఆంధ్రప్రభ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తున్న సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఈ సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి – 2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి ప్రారంభమైంది.
అభ్యర్థులు నవంబర్ 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. సీటెట్ పరీక్షను 2024 జనవరి 21న కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. జనరల్/ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1, 2 రెండూ). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1, 2 రెండూ) చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్ష విధానం:
సీటెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూల్స్ ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.