Tuesday, November 26, 2024

పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచిన ధోని.. బ్యాటింగ్ చేయనున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్‌లో రెండు బలమైన బ్యాటింగ్ లైనప్‌లు ఉన్న జట్లు ఢీకొట్టేందుకు రెడీ అయ్యాయి. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయనుంది.. ఈ మ్యాచ్‌లో ఒక విధంగా చెన్నై ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే ఈ రెండు జట్లు చివరగా తలపడిన మూడు మ్యాచుల్లోనూ పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దానికితోడు చెన్నైపై శిఖర్ ధవన్ రికార్డు కూడా సూపర్‌గా ఉంది. ఈ క్రమంలో పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచినా ఆశ్చర్యం లేదు. అయితే గత మూడు మ్యాచుల్లో ఏదీ చెపాక్‌లో జరగలేదు. సొంత మైదానంలో ఆడేటప్పుడు చెన్నై ఎంత బలంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దానికితోడు స్పిన్ విభాగంలో చెన్నై చాలా బలంగా కనిపిస్తోంది. టాపార్డర్‌లో రుతురాజ్, కాన్వే ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
మిడిలార్డర్‌లో రహానే, దూబే, మొయీన్ అలీ కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ఇంకా బ్యాటుతో రాణించాల్సి ఉంది. ఈ విషయంలో పంజాబ్ మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో పంజాబ్ తన స్థాయికి మించిన ప్రదర్శన చేసింది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది.
అదే సమయంలో పంజాబ్ బౌలింగ్‌లో ఒక డొల్ల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టీం ఎక్కువగా తమ పేస్ బౌలింగ్ బలంతో ఈ జట్టు ముందుకు దూసుకొస్తోంది. అర్షదీప్ సింగ్ ఈ జట్టు పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. అదే సమయంలో ఆ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం పేలవంగా ఉంది. ప్రధాన స్పిన్నర్ రాహుల్ చాహర్ ఈ సీజన్‌లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.
అతనికి ప్రత్యామ్నాయంగా హర్‌ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్‌స్టోన్ తదితరులు స్పిన్ దళాన్ని మోస్తున్నారు. ఈ విషయంలో చెన్నై చాలా మెరుగ్గా ఉంది. చెపాక్‌లో స్పిన్నర్ల హవా కొనసాగితే.. పంజాబ్ వెనుక బడటం ఖాయం. ఈ క్రమంలోనే బ్యాటింగ్ బలంగా ఉన్నా కూడా ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం మాత్రం చెన్నైకే ఒకింత ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement