న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. క్రూడ్ ఆయిల్ గత 15 రోజుల సగటును పరిగణలోకి తీసుకుని ఇక్కడ పెట్రోల్, డీజెల్ ధరలను ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయి. ఈ అంశంపై ఇప్పుడు చర్చ ఎందుకంటే.. గ్లోబల్ మార్కెట్లలో గత శుక్రవారం క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా క్షీణించాయి. ఏకంగా 4 – 6 డాలర్లు లేదా 5 శాతానికిపైగా పతనమయ్యాయి. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ భయాలు ఇందుకు దారితీశాయి. అయితే మరిన్ని రోజులపాటు క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా పతనమైతే దేశీయంగా పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గొచ్చని ఆయిల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్రూడ్ ఆయిల్ 15 రోజుల సరాసరిని పరిగణలోకి తీసుకుని ఇక్కడ పెట్రోల్ ధరలను నిర్ణయిస్తారు కాబట్టి మరిన్ని రోజులు తగ్గాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గించడం, ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా వ్యాట్ కోత విధించడం తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా మరింత తగ్గితే వాహనదారులకు మరింత ప్రయోజనం కలిగే అవకాశముంది. కాగా దాదాపు 23 రోజులుగా దేశంలో పెట్రోల్, డీజెల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. యథాతథంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.