Monday, November 25, 2024

కనిష్టానికి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు.. దేశీయంగా దిగిరాని రేట్లు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యాంకింగ్‌ రంగంలో వరసగా వెలుగు చూస్తున్న సంక్షోభాలు, అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపుతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధిక మాంద్యం తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడ్‌ ఆయిల్‌ ధరలు 15 నెలల కనిష్టానికి పడిపోయాయి.
రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. వంద డాలర్లకు పైగా కొన్ని నెలల పాటు ట్రేడయ్యింది. కొన్ని నెలలుగా క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో డిస్కౌంట్‌ ధరకే చమురు సరఫరా చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి మన దేశం డిస్కౌంట్‌తో రష్యా నుంచి చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది.

ఇందులో ప్రైవేట్‌ సంస్థల కంటే రిలయన్స్‌, నయారా వంటి సంస్థలకే ఎక్కువ లాభపడుతున్నాయి. డిస్కౌంట్‌కు వస్తున్న చమురును ఈ సంస్థలు మన దేశంలో విక్రయించే బదులు అధిక ధరలకు యూరోపియన్‌ దేశాలకు, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం భయాలతో చమురు ధరలు 70 డాలర్లకు దిగువ ట్రేడవుతున్నది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ ఏప్రిల్‌ నెల కాంట్రాక్ట్‌లో బ్యారెల్‌కు 64.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2021 డిసెంబర్‌ తరువాత ఈ స్థాయిలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి.

- Advertisement -

మన దగ్గర ఎందుకు తగ్గడంలేదు…

మన దేశం రష్యా నుంచి చౌక ధరకే ముడి చమురును దిగుమతి చేసుకుంటున్పటికీ మన మార్కెట్‌లో మాత్రం ధరలు తగ్గడంలేదు. తాజాగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ చమురు ధరలు 70 డాలర్లకు పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ , హిందూస్థాన్‌ పెట్రోలియం కంపెనీలు 15 నెలలుగా రోజువారి ధరలను సవరించడంలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం సూచనతో కంపెనీలు వీటిని సవరించడంలేదు. మరో వైపు ప్రైవేట్‌ కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇవి ఎక్కువగా తిరిగి అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయంగా అధిక ధర ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం అదే రేట్లకు డీజిల్‌, పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి. అందు వల్ల తగ్గిన ధరలను కంపెనీలు వినియోగదారులకు అందించలేకపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో 21 వేల కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. ధరలు తగ్గిన ఈ సమయంలో ఈ నస్టాలను కంపెనీలు భర్తీ చేసుకుంటున్నాయి. ప్రస్తుత ముడి చమురు ధరల ప్రకారం చూస్తే పెట్రోల్‌పై లీటర్‌కు 8.7 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 11.1 రూపాయి లాభాలు ఆర్జిస్తున్నాయి. మరో రెండు త్రైమాసికాల పాటు అంతర్జాతీయ ధరలు ఇలానే ఉంటే, అప్పుడు తగ్గిన ధరలను వినియోగదారులకు బదలాయించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement