రాంలల్లా ప్రాణప్రతిష్ట వేడుకలను దేశమంతా సంబురంగా జరుపుకున్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ట అనంతరం మంగళవారం నుంచి భక్తులకు రాంలల్లా దర్శనం కల్పించారు. తొలిరోజు బాలరామున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో అయోధ్య రామాలయమంతా జనసంద్రోహంగా మారింది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.
కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చని, ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.