Wednesday, November 20, 2024

11లక్షల ఎకరాల్లో పంట నష్టం.. వెయ్యి కోట్లకు చేరువలో నష్టతీవ్రత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పంట నష్టం అంచనాలకు ప్రభుత్వం వేగంగా కదులుతోంది. ఉగ్రగోదావరి శాంతించడంతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని గుర్తించే పనిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు విస్తృత కసరత్తు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మదింపునకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు నష్టం విలువ రూ. 1000 కోట్లకు మించవచ్చని తెలుస్తోంది. ఇక ప్రాజెక్టులకు జరిగిన ఆర్ధిక నష్టం ఇప్పట్లో అంచనా వేయలేకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానాకాలం సీజన్‌ మొదలై పంటలు నాటిన ప్రతీచోటా తీవ్ర నష్టం వాటిళ్లింది. ప్రాథమికంగా అందిన వివరాల మేరకు 10లక్షలకుపైగా పంట పొలాలు నీటమునిగాయని తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగడంతో పంటపొలాల్లో ఇసుక మేటలు వేసింది. దీంతో వరిపంటతోపాటు, పత్తి, మొక్కజొన్న, మినుములు, సజ్జలు, ఆముదాలు వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వనాకాలం పంట సీజన్‌ ప్రారంభమవడం, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుబంధు నిధులను జమ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో రైతాంగానికి పలు సమస్యలు తలెత్తాయి. ఇప్పటికే విత్తిన పంటలు, మొలకెత్తేదశలోని పంట తీవ్రంగా నాశనమైంది. సాగు ప్రారంభ దశలోనే తీవ్రమైన వర్షాలు కురవడంతో పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరడం, ఇసుక మేటలతో పంటంతా నేలపాలైంది. ఈ నేపథ్యంలో సుమారు 11 లక్షల ఎకరాలు ఇలా వరదలతో అతి తీవ్రంగా దెబ్బతిందని అంచనాలున్నాయి. ఈ మేరకు వ్యవసాయ విస్తరణాధికారులు రాష్ట్రమంతటా పర్యటించి క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు. తుది నివేదిక వచ్చేసమయానికి ఇది మరింత పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. కాగా వర్షాల ప్రారంభం నాటికి 55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. పత్తి, 38.48లక్షల ఎకరాలు, వరి 54లక్షల ఎకరాలు, సోయాబీన్‌ 3.21లక్షల ఎకరాలు, పప్పుధాన్యాలు 4.10లక్షల ఎకరాలు, మొక్కజొన్న 2.50లక్షల ఎకరాలలో సాగైనట్లు లెక్కలందాయి.

మొలకెత్తేదశలో కురిసిన భారీ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇలా అన్ని రకాల పంటలకు నష్టం వాటిళ్లింది. పత్తి 7లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నదని, వరి, సోయా, కంది, మొక్కజొన్న పంటలు లక్షలాది ఎకరాల్లో నీటిలోనే ఉండిపోయాయని అధికారులు గుర్తించారు. తొలకరిలోనే అతిభారీ వర్షాలు కుండపోతగా కురవడంతో పంటల నష్టం పూర్తిస్థాయిలో గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే రెండుదశల్లో పత్తిని విత్తిన రైతాంగం తాజా వర్షాలతో మరింత ఆందోళనల్లో పడిపోయింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, మెదక్‌, హన్మకొండ, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. పలు ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆయకట్టుతోపాటు, పాత ఆయకట్టులో కూడా పంటలు నష్టం చవిచూశాయి. హన్మకొండ జిల్లాలో 80వేల ఎకరాల్లో, వరంగల్‌లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, జయశంకర్‌ భూపాలపల్లిలో 15వేల ఎకరాల పత్తి, 24వేల ఎకరాల్లో వరి పంట నష్టం వాటిళ్లింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, వరిపంటలతోపాటు మేడ్చేల్‌, మల్కాజ్గిరి జిల్లాలో కూరగాయల సాగుపై ప్రభావం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంటలపై ప్రభావం పడి 30వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. కామారెడ్డి జిల్లాలో 5వేల ఎకరాల్లో ప్రాథమికంగా పంట నష్టం అంచనా వేశారు. ఆదిలాబాద్‌లో 10వేల ఎకరాల్లో పత్తి, 5వేల ఎకరాల్లో సోయా, 3వేల ఎకరాల్లో కంది దెబ్బతిన్నది ఈ జిల్లాలో 5.62లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా, వేత ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయని తెలిసింది. కుమ్రంభీం అసిఫాబాద్‌లో 45వేల ఎకరాల్లో పత్తి, 5వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు, కరీంనగర్‌ జిల్లాలో 4వేల ఎకరాలు, పెద్దపలల్‌లో 4500ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు, జగిత్యాల జిల్లాలో 18వేల ఎకరాలు, నల్గొండలో 20వేల ఎకరాల్లో, భువనగిరిలో 16వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోయినట్లు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement