Thursday, November 21, 2024

ఈ-క్రాప్‌ నమోదుతో పంట నష్టపరిహారం.. పైసా చెల్లించాల్సిన అవసరమే లేదు

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో : ఉచిత పంటల బీమా కోసం రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ-క్రాప్‌ నమోదు చేసుకుంటే చాలు పంట నష్టపరిహారం అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో డా.వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చేలోగా ఏదైనా ప్రకృతి విపత్తుతో నష్టపోతే రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న బకాయిలు చెల్లిస్తూ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక్క విడతలోనే రూ. 2,977.82 కోట్లు ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉచిత పంటల బీమా పథకం కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.

రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలుస్తున్నాన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక ప్రతిపక్షం పస లేని ఆరోపణలు చేస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటు-ందని విశ్వసించిన వ్యక్తిగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలుస్తున్నారని, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మీ అందరి ఆశీస్సులు అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మనూరు జయరామ్‌, రాష్ట్ర కె.వి.ఉష శ్రీ చరణ్‌, ప్రభుత్వ శాసనమండలి విప్‌ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, ఎంపీలు గోరంట్ల మాధవ్‌, తలారి రంగయ్య, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాలగుండ్ల శంకర నారాయణ, శ్రీధర్‌ రెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement