Friday, November 22, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై నేరాభియోగం.. మియామీ కోర్టు ఎదుటకు ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అణు కార్యక్రమం, మిలటరీకి చెందిన రహస్య పత్రాలను ఆయనకు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌లోని బాత్‌రూమ్‌లో దాచి ఉంచారని మాజీ అధ్యక్షుడిపై మోపిన 37 నేరాభియోగాల్లో ఒకటి పేర్కొంది. 2024 అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయనపై నేరాభియోగాలు మోపడం విశేషం. అంతేకాకుండా అదే చోట వేడుకలు జరిపే బాల్‌రూమ్‌లో సైతం పత్రాలను ఉంచారు. 2021లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం వైట్‌ హౌస్‌ నుంచి వెళుతూ ప్రభుత్వానికి చెందిన అనేక రహస్య పత్రాలను ట్రంప్‌ తనతోపాటుగా అక్రమంగా తీసుకొని వెళ్ళారు.

వాటిని ఫ్లోరిడా హౌస్‌లో ఉంచారు. దీంతో వందలాది రహస్య పత్రాలను అక్రమంగా హస్తగతం చేసుకున్నారనే అభియోగాన్ని ఆయనపై మోపారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై అభియోగాలకు రుజువులు చూపుతున్నట్టుగా ఆయనకు చెందిన మార్‌-ఎలాగో ఎస్టేట్‌లోని గదుల్లో అట్టపెట్టెల్లో కుక్కి ఉన్న పత్రాలు లాంటి ఆరుకు పైగా ఛాయాచిత్రాలను అధికారులు విడుదల చేశారు. పత్రాలను హస్తగతం చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారనే అభియోగం కూడా ట్రంప్‌పై ఉంది.

- Advertisement -

తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్న మాజీ అధ్యక్షుడు మంగళవారం మధ్యాహ్నం మియామి కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ట్రంప్‌ తన చేతివాటంతో ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను అక్రమంగా తరలించుకుపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement