ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 15 తరువాత నుంచి నేతలపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన విచారణ జరుపుతామని తెలిపింది. సీబీఐతో పాటు ఇతర ఏజెన్సీలు ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేసిందని, వెంటనే వీటిపై విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయ స్థానం పైవిధంగా స్పందించింది. రాజకీయ నేతలపై త్వరిగతిన విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. సుమారు 2000 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని, తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను దృష్టిలో పెట్టుకుని విచారణను వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కోరారు. గత ఐదేళ్లుగా 2000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. దేశంలోని ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాల్సిందిగా.. 16వ రిపోర్టు దాఖలు చేయబడిందని హన్సారియా ధర్మాసనానికి వివరించారు.
సుప్రీం కొస్తే కీలకం
దిగువ కోర్టుల్లో.. అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. సుప్రీం కోర్టు వరకు కేసులు వస్తే.. వాటికి ప్రాధాన్యత పెరుగుతుందని, ఇతర కేసుల విషయంలో బాధితులు కొంత కాలం వేచి ఉండేందుకు ఇబ్బంది లేదని తెలిపారు. సుప్రీం కోర్టుకు చేరితే.. ఎంతో కీలకంగా మారుతుందని న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని, కొన్ని ఆదేశాలు జారీ చేశామని సీజేఐ ఎన్‌వీ రమణ అన్నారు. కొంత సమయం వేచి ఉండాలని, న్యాయమూర్తులు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తే.. రెండు బెంచ్‌లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా రెండు బెంచ్‌లకు నేను ఆటంకం కల్గించొచ్చా..? అని సీజేఐ ప్రశ్నించారు. ఏప్రిల్ 15 తరువాత కచ్చితంగా నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతుందన్నారు.