భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ భార్య మోసపోయింది. జయా భరద్వాజ్‌ను హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేస్తామనే నెపంతో రూ.10 లక్షల దాకా ఎగ్గొట్టినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న జయ నుండి డబ్బు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. వ్యాపారం చేస్తామంటూ తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి వారు నిరాకరించడంతో చాహర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
క్రికెటర్ దీపక్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రాలోని హరి పర్వత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చాహర్ కుటుంబం డబ్బు తిరిగి ఇవ్వమని కోరినప్పుడు, వారు తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ధ్రువ్ పరీక్, కమలేష్ పరీక్ అని తెలుస్తోంది. వారిలో ఒకరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)లో అధికారిగా ఉన్నట్టు సమాచారం.