Friday, November 22, 2024

Big Story | టౌన్‌షిప్‌ల విస్తరణపై సీఆర్‌డీఏ దృష్టి.. వెయ్యి ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌కు కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రతి నియోజకవర్గంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల (ఎంఐజీ ) సొంతింటి కల సాకారం చేసే దిశగా టౌన్‌షిప్‌ల విస్తరణపై రాజధాని ప్రాంత ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఫోకస్‌ పెంచింది. సీఆర్‌డీఏ పరిధిలోని ఐదు జిల్లాల్లో (కొత్త జిల్లాలతో కలుపుకుని) 26 నియోజకవర్గాల్లో ఎంఐజీ టౌన్‌షిప్‌ల లో లేఅవుట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొన్నిచోట్ల భూ సేకరణ పూర్తికాగా, మరికొన్ని నియోజకవర్గాల్లో సవరించిన ప్రతిపాదనలు, భూ సేకరణలో ఎక్కువ ధర డిమాండ్‌ తదితర సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.

అన్నింటినీ అధి గమించి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడు రాజధానుల నేపథ్యంలో సీఆర్‌డీఏ పరిధిలో టౌన్‌షిప్‌ల పట్ల కొనుగోలుదార్లు ఆసక్తి చూపకపోయినా మధ్యతరగతి వర్గాలకు ప్రత్యేకించి రాయితీలతో ఇళ్ల స్థలాలు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వెయ్యెకరాల మేర ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సీఆర్‌ డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ నియోజకవర్గాల్లో భూ సేకరణ వివిధ దశల్లో ఉండగా కొన్నిచోట్ల స్థల పరిశీలన జరుపుతోంది.

- Advertisement -

టౌన్‌షిప్‌లలో ప్లాట్ల కొనుగోలుకు ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మినహాయింపుతో పాటు కొనుగోలుదార్లకు అందుబాటు ధరల్లో మార్కెట్‌ ధర ప్రామాణికంగా స్థలాలను విక్రయించి ఈ లాటరీ పద్దతి ద్వారా కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 60 శాతం అమ్మకపు ధరపైనే రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. జగనన్న ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌ ప్లాట్లను మూడు విడతల్లో విక్రయాలు పూర్తి చేసింది.

దీనివల్ల రూ. 60 కోట్ల మేర ఆదాయం లభించింది. తాజాగా నూజివీడు మునిసిపాల్టిd పరిధిలో 40.78 ఎకరాల్లో కొత్త లేఅవుట్‌ ప్లాట్లను అమ్మకానికి సిద్ధం చేసింది. ఇక్కడ భూ సేకరణ పూర్తయి భూములు సీఆర్‌డీఏ స్వాధీనం చేసుకుంది. చ దరపుగజం రూ. 8500 చొప్పున విక్రయించాలని ఇటీవలే నిర్ణయించింది. ఏపీ రేరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొన సాగుతోంది. వీటితో పాటు కొత్తగా ప్రతిపాదించిన జగనన్న టౌన్‌షిప్‌ల లేఅవుట్లు కొన్ని భూ సేకరణ దశలో ఉండగా, మరికొన్నింటికి మ్యాపింగ్‌ జరుగుతోంది..

లేఅవుట్లలో మౌలిక సదుపాయాలైన భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థతో పాటు మెరక, విద్యుత్‌, త్రాగునీరు వంటి సదుపాయాల పనులు కూడా ఒకేవిడత చేపడుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఈస్ట్‌ , వెస్ట్‌ , సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి పెదవుటుపల్లి, ఉంగుటూరు గ్రామాల పరిధిలో మ్యాపింగ్‌ జరుగుతోంది. భూ సేకరణ జరపాల్సి ఉంది. గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గానికి చేబ్రోలు మండలం నారాకోడూరులో భూ సమీకరణకు సీఆర్‌డీఏ రూ. 20 కోట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు బదలాయించింది. అయితే అయితే రైతులు ఎక్కువ ధర డిమాండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆ ప్రతిపాదన విరమించుకుని మరో చోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నేలపాడులో 36.55 ఎకరాల్లో లేఅవుట్‌ ఏర్పాటుకు అనుమతులు మంజూరు కావటంతో పాటు భూ సేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు ఖర్చయ్యే నిధులు రూ. 34.49 కోట్లు బ్యాంక్‌ సహకారం తీసుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. కాగా గుంటూరు వెస్ట్‌ (పశ్చిమ) నియోజకవర్గం పరిధిలోని అంకిరెడ్డిపాలెంలో 40 ఎకరాల్లో లేఅవుట్‌ వేయాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. అయితే రోడ్‌ యాక్సెస్‌ మినహా 32.385 ఎకరాల్లో లేఅవుట్‌కు భూ సేకరణ జరిపేలా సవరించిన ప్రతిపాదనలు అందించాలని గుంటూరు కలెక్టర్‌ సూచనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఇదే నియోజకవర్గం పరిధిలోని బొంతపాడులో భూ సేకరణకు రూ. 31.5 కోట్ల ఖర్చుతో 35 ఎకరాల్లో టౌన్‌షిప్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ 40 అడుగుల రోడ్డు విషయంలో స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో రెండువందల ఎకరాల్లో రూ. 90 కోట్లతో భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం కాగా తొలి విడతగా 50 ఎకరాల్లో వెంచర్‌ వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పరిధిలో 209.1 ఎకరాల భూ సేకరణ జరపాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ అగ్రిగోల్డు భూములు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం అనుమతికై ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే పెద్దఎత్తున టౌన్‌షిప్‌ అభివృద్ధి చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. మైలవరం నియోజకవర్గం పరిధిలో కొత్తూరు తాడేపల్లిలో భూ పరిశీలన జరిపినప్పటికీ అనువుగా లేకపోవటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరువూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 147.4 ఎకరాలతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలకు సవరణలు చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం పరిధిలో నిడుబ్రోలులో 23.7 ఎకరాల్లో ఎకరం రూ 46 లక్షల చొప్పున అందించేందుకు రైతులు అంగీకరించారు.

దీనిపై పున పరిశీలన జరుపుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో 20.57. మాచర్లలో 31 ఎకరాలు, గురజాలలో 41.89, నరసరావుపేట ఉప్పలపాడు గ్రామంలో 25.04 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ల పనులను పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అప్పగించారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గాలు బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఉన్నందున ఉడాకు బదలాయించారు. కృష్ణాజిల్లా పెనమలూరు, పామర్రు, జగ్గయ్యపేట, గుంటూరుజిల్లా తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు భూములు పరిశీలన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 954.21 ఎకరాల మేర భూ సేకరణకు ప్రతిపాదనలు రూపొందించి లేఅవుట్లు ఏర్పాటుచేసే దిశగా సీఆర్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement