ఇండియాలో సహ పలుదేశాలలో నిలిచిపోయిన
బ్యాంకింగ్, విమాన సేవలు
వివిధ సంస్థల కార్యకలాపాలకు బ్రేక్
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు, బ్యాంకు సేవలకు స్తంభించాయి. విండోస్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా. శుక్రవారం ఉదయం నుంచి ఈ సమస్య ఎదురుకుంటున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ సమస్య కారణంగా అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి.
సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం..
విమాన సేవల నుంచి సూపర్ మార్కెట్, బ్యాంకింగ్ సేవల దాకా గ్లోబల్ మైక్రోసాఫ్ట్ క్రాష్ అన్ని రంగాలకు అంతరాయం కలిగిస్తోంది. దీంతో దేశంలో మూడు ఎయిర్ క్యారియర్లు.. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ సంస్థలు.. బుకింగ్, చెక్-ఇన్,ఫ్లైట్ అప్డేట్లలో సమస్యలు ఎదురుకుంటున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి. ఇదే విషయాన్ని తమ ప్రయాణికులకు మెస్సెజ్ రూపంలో చేరవేశాయి. ఇక.. ఈ క్రాష్‌పై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ.. తమ బృందం సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తోందని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ సేవలు కొనసాగుతాయని పేర్కొంది.