Tuesday, November 26, 2024

వచ్చే ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీకి సీపీఎం కసరత్తు.. పాలేరు నుంచి తమ్మినేని పోటీ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 9 నియోజకవర్గాలపై సీపీఎం దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌తో పొత్తు, రాజకీయ సర్దుబాటు చేసుకున్నప్పటికీ ఈ నియోజకవర్గాలకై పట్టుబట్టేందుకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. గత రెండు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సభలో అడుగుపెట్టే అవకాశం ఆ పార్టీకి దక్కలేదు. అయితే, ఈ ఏడాది జరగనున్న శాససనభ ఎన్నికల్లో పోటీ చేసి ఎట్టి పరిస్థితుల్లో సభలో అడుగుపెట్టి ప్రజాసమస్యలను ప్రస్తావించాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. ఆ దిశలోనే పార్టీ అగ్ర నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో అధికారం దక్కకూడదనే లక్ష్యంతో ఉన్న సీపీఎం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని ఇదివరకే ప్రకటించింది. పొత్తు కుదిరితే ఉమ్మడి నిర్ణయం మేరకు పోటీ చేస్తుంది. లేకపోతే ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం 9 స్థానాలలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

- Advertisement -

ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఇటీవల జరిగిన పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ కేడర్‌ బాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేయాలనే విషయంలో కార్యవర్గం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇదే విషయమై పోటీ చేయదల్చుకున్న నియోజకవర్గాల కేడర్‌కు సమాచారం కూడా ఇచ్చారు. ఆ దిశలోనే ఈ నియోజకవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను చేపడుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం తన వంతు కృషి చేసింది. తమ అభ్యర్థి విజయం వెనుక మిత్రుల సహకారం ఉందని సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సైతం వామపక్షాలతో కలిసి వెళతామని కేసీఆర్‌ ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉన్నందున పోటీ చేయదల్చుకున్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసి, కేడర్‌ పెంచుకోవాలనే క్రమంలో 9 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒకప్పటి తమ కంచుకోటల్లో తిరిగి పాగా వేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది.

అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, కొత్తగూడెం, మధిర, భద్రాచలం, వైరా, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నకిరేకల్‌, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం, హైదరాబాద్‌ పరిధిలోని ముషీరాబాద్‌ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. వీటిలో ఒక్క ముషీరాబాద్‌ తప్ప మిగతా నియోజకవర్గాల్లో గతంలో సీపీఎం గెలిచిన స్థానాలే ఉన్నాయి. పార్టీ రాష్ట్ర సారథి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో ఆయన పాలేరు నుంచి పోటీకి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే, మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాలలో కూడా ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం ఉన్నట్లు సమాచారం. అయితే, సీపీఎం పోటీ చేసే స్థానాల విషయం పొత్తుల తర్వాతే తేలే అవకాశం ఉంది. అందువల్ల బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీలతో పొత్తులపై చర్చల అనంతరం తమ స్థానాలను కుదించుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నాయకుడొకరు ఆంధ్రప్రభకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement