Tuesday, November 26, 2024

Delhi | ఢిల్లీ వరద ప్రాంతాల్లో సీపీఐ నారాయణ.. పార్టీ నేతలతో కలిసి పర్యటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యమునా నది వరద ముంచెత్తిన దేశ రాజధానిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నేతల బృందం సోమవారం పర్యటించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ నేతృత్వంలో జాతీయ నేతలు రామకృష్ణ పాండా, ప్రొ. దినేశ్ వర్షే, ఆలిండియా కిసాన్ సభ నేత ఆర్. వెంకయ్య, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశ్వరి తదితరులతో కూడిన బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించింది. సిగ్నేచర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిపోయిన అనేక లోతట్టు ప్రాంత కాలనీలను బృందం సందర్శించింది.

- Advertisement -

వర్షాలు తగ్గి వారం రోజులైనా సరే వరద ప్రభావం తగ్గలేదని బృంద సభ్యులు గ్రహించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ 5 అడుగుల మేర వరద నీరు నిలిచి ఉంది. యమునా బజార్‌ నీట ముంపునకు గురవడంతో రోడ్లపై టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్న స్థానికులతో సీపీఐ నేత నారాయణ బృందం మాట్లాడింది. అక్కడ వైద్య సదుపాయాలు ఏమాత్రం లేవని, వరద కారణంగా ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని సీపీఐ నేత నారాయణ తెలిపారు.

ఇప్పటికే నగరంలో దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ జ్వరాల కేసులు పెరిగాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం మినహా బాధితులను ఎవరూ ఆదుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన రూ. 10 వేల సాయం చాలా తక్కువ అని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నీటి పంపింగ్ చేపట్టి బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. వరద ముంపు ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కారణంగా ముంపు ప్రభావం పెరిగిందని తమ పరిశీలనలో తేలిందని అన్నారు. వరద నిర్వహణలో శాస్త్రీయ హేతుబద్ధతను వర్తింపజేయాలని సూచించారు. తద్వారా ఢిల్లీ నగరాన్ని భవిష్యత్తులో వరద ప్రభావం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement