చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్ ఎన్నిక కావడం ఇక లాంఛనమే. వారంరోజులుగా జరుగుతున్న సీపీసీ సమావేశాలు శనివారం ముగింపు దశలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీనీ, ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న జిన్‌పింగ్‌కి మూడోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నేడు పార్టీ కేంద్రకమిటీ, పోలిట్ బ్యూరోలు ఆమోదముద్ర వేస్తాయి.. మావో తర్వాత అంత బలవంతుడైన నాయకునిగా జిన్‌పింగ్ పార్టీ ప్రశంసలు అందుకుంటున్నారు.25 మంది సభ్యులు గల పోలిట్ బ్యూరోని పార్టీ కేంద్ర కమిటీ పునర్వ్యవస్థీకరించింది.
ఈ బ్యూరో అత్యధికులు జిన్‌పింగ్ ఆంతరంగికులు. ఆదివారం ఉదయం కేంద్ర కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో జిన్‌పింగ్ మూడోసారి పార్టీఅధినేdతగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తారు. జిన్‌పింగ్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పార్టీ నియమావళిలో చేసిన మార్పులు చాలా ముఖ్యమైనవి. ఆయనను జీవిత కాల అధ్యక్షునిగా నియమిస్తూ చేసిన సవరణ ముఖ్యమైనది. ఈసారి కూడాఅలాంటి ముఖ్యమైన సవరణలు ఉండవచ్చు. ఏ వ్యక్తీ రెండు పర్యాయాలకు మించి అధ్యక్షునిగా వ్యవహరించరాదన్న నిబంధనను 2018లో జరిగిన సమావేశాల్లో సవరించారు.
తెగించి పోరాడండి..
అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల పర్యవసానంగా ఎదురవుతున్న సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా సభ్యులు మరిన్ని సంస్కరణలకు సంసిద్ధం కావాలని జిన్‌పింగ్ పిలుపు ఇవ్వనున్నారు. 200 మందితో కొత్తగా కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. వీరంతా పార్టీ సీనియర్ నాయకులే. ఎదురుగాలులు, సముద్రంలో ఎగిసి పడే అలలను ఎదుర్కొని నిలదొక్కుకోవడానికి మరిన్ని దృఢమైన, స్థిరమైన నిర్ణయాలు అవసరమని శనివారం నాడుసభ్యులనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. అంతర్జాతీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూ వాటి సంగతి ఎలా ఉన్నా, చైనాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక, సాంకేతిక రంగాల్లో చైనా సాధించిన విజయాలన్నీ ఈ లక్ష్యాల వల్లనే సాధ్యమయ్యాయని చెప్పారు. హాంకాంగ్‌లో సంక్షోభం నుంచి తిరిగి మామూలు పరిస్థితులు నెలకొనేందుకు అక్కడి రాజ్యాంగం తోడ్పడిన విధానాన్ని జిన్‌పింగ్ ప్రస్తావించారు. మిగిలిన సమస్యలు కూడా అదే మాదిరిగా దారికి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తన భూభాగాలను అణు మాత్రం వదులుకోబోదని స్పష్టం చేశారు.