Wednesday, November 20, 2024

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీపీ సజ్జనార్..

సైబరాబాద్ మాజీ పోలీసు కమిషనర్‌ సీపీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీపీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. దిశ కేసులో సత్వర న్యాయం చేశారంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సజ్జనార్‌ను కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2019 లో దేశం లోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతం లో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాలలో పనిచేశారు.

ఇక సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలతో సన్నిహితంగా మెలిగే సజ్జనార్‌ను అంతగా ప్రాధాన్యం లేని ఆర్టీసీకి ఎండీగా పంపించడంపై పలువురు నిరాశకు గురయ్యారు. సమర్థుడైన అధికారిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సజ్జనార్‌ ఆర్టీసీకి బదిలీ చేయడం వెనుక సీఎం కేసీఆర్ అనేక సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాక్‌డౌన్ మరింత కుంగదీసింది. దీంతో వీలైనంత మంది సిబ్బందిని ఇంటికి పంపిస్తే సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా సజ్జనార్ సమర్థంగా నిర్వహించగలరన్న నమ్మకంతోనే ఆయన్ని ఆర్టీసీ ఎండీగా నియమించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సిరీస్ గెలవాలంటే కోహ్లీని నిశబ్దంగా ఉంచాలి: జో రూట్

Advertisement

తాజా వార్తలు

Advertisement