కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిన్ పోర్టల్ ఇకపై తెలుగు భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో హిందీ కాకుండా మొత్తం పది ప్రాంతీయ భాషల్లో పోర్టల్ పనిచేయనుంది. ఈ మేరకు తెలుగుతో పాటు మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, ఇంగీష్ భాషల్లో పోర్టల్ అందుబాటులో ఉండనుంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18 ఏళ్లుపైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ కోసం కేంద్రం నిర్వహిస్తున్న కోవిన్ పోర్టల్‌లో ఇప్పటిదాకా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆ భాషలు రాని వారు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో చాలా ఇబ్బందులుపడుతున్నారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగేందుకు ఇది కూడా ఒక కారణంగా మారింది. దీంతో ఈ అడ్డంకిని అధిగమించేందుకు కేంద్రం ఆరోగ్య శాఖ ప్రాంతీయ భాషల్లోనూ పోర్టల్ పనిచేసేలా మార్పులు చేసింది. ఫలితంగా ఇకపై వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు మరింత సులభతరం కానున్నాయి.