మనిషి అన్న తర్వాత కాసింత కళాపోషణ ఉండాలని ఓ సినిమాలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్. కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తుంటారు. దీంతో కొందరు సక్సెస్ అవుతారు.. మరికొందరు నవ్వులపాలవుతారు. ఈ నేపథ్యంలో మండుతున్న ఎండల కారణంగా హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా తన కారుకు ఆవు పేడ పూసేశాడు. పేడ పూసిన కారుతో కూకట్పల్లి ప్రాంతంలో రోడ్లపైకి వచ్చాడు. ఆవు పేడలో ఉన్న సుగుణాల కారణంగా కారు కలర్ షేడ్ మారకుండా ఉండేందుకు, ఎండ బారి నుంచి తప్పించుకోవడానికే అతడు ఇలా చేసినట్లు పలువురు మాట్లాడుకుంటున్నారు.
దీంతో పలువురు పేడ పూసిన కారు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కొందరు మాత్రం ఆ వ్యక్తి చర్యపై సెటైర్లు వేస్తున్నారు. ఆవు పేడలో ఉన్న సుగుణాలను వివరిస్తూ అతడి చర్యను సమర్థిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమైంది.