Friday, November 22, 2024

కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు

క‌రోనా వైర‌స్‌ నివారణకు ప్ర‌స్తుతం ఇండియాలో రెండు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అందులో ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ ఒక‌టి కాగా.. హైద‌రాబాద్ భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ మరొక‌టి. ఈ రెండు వ్యాక్సిన్లు క‌రోనా నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ట్లు తాజాగా జ‌రిగిన అధ్య‌య‌నం తేల్చింది. ఇండియాలో డాక్ట‌ర్లు, న‌ర్సుల‌తో కూడిన తొలి అధ్య‌య‌నం ఇది. దీనిని ఇంకా ప్ర‌చురించాల్సి ఉంది. డాక్ట‌ర్ ఏకే సింగ్‌, ఆయ‌న స‌హ‌చ‌రులు ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించారు. కొవిషీల్డ్ తొలి డోసు వేసుకున్న త‌ర్వాత 70 శాతం ర‌క్ష‌ణ క‌లుగుతున్న‌ట్లు ఈ అధ్య‌య‌నం తేల్చ‌గా.. కొవాగ్జిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రాథ‌మిక స‌మాచారాన్ని బ‌ట్టి 81 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోంది.

కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు
రెండు వ్యాక్సిన్లు స‌మ‌ర్థంగానే ప‌ని చేస్తున్నా.. యాంటీబాడీల విషయానికి వ‌స్తే మాత్రం కొవిషీల్డ్‌తోనే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 515 మంది ఆరోగ్య కార్య‌కర్తల‌పై ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించారు. వీళ్ల‌లో 305 మంది పురుషులు, 210 మంది మ‌హిళ‌లు ఉన్నారు. వీళ్లు ఈ వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్నారు. మొత్తం 425 మంది కొవిషీల్డ్ తీసుకున్న వాళ్ల‌లో 98.1 శాతం, 90 మంది కొవాగ్జిన్ తీసుకున్న వాళ్ల‌లో 80 శాతం సెరోపాజిటివిటీ (ఎక్కువ యాంటీబాడీలు) క‌నిపించింది.

రెండు వ్యాక్సిన్లు రెండు డోసుల త‌ర్వాత‌ మంచి రోగ‌నిరోధక వ్య‌వ‌స్థ‌ను అందిస్తున్నా.. సెరోపాజిటివిటీ రేట్లు, స‌గ‌టు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైట‌ర్‌ల విష‌యంలో కొవిషీల్డ్ చాలా మెరుగ్గా ఉన్న‌ట్లు గుర్తించారు. దీనికోసం యాంటీబాడీ టైట‌ర్ బ్ల‌డ్ టెస్టులు చేశారు. ఇది ర‌క్తంలో యాంటీబాడీల ఉనికితోపాటు వాటి స్థాయిని కూడా చెబుతాయి. దీని ప్ర‌కారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల‌లో యాంటీబాడీ టైట‌ర్ 115 AU/ml (ఆర్బిట్ర‌రీ యూనిట్స్ ప‌ర్ మిల్లీలీట‌ర్‌)గా ఉండ‌గా.. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్ల‌లో 51 AU/mlగా ఉంది. ఆ లెక్క‌న కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌లో యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువని ఈ అధ్యయ‌నం తేల్చింది. అయితే మొత్తంగా రెండు వ్యాక్సిన్లు క‌రోనాపై అద్భుతంగా ప‌ని చేస్తున్నాయ‌ని, దేశంలో మూడో ద‌శ క‌రోనా రాకుండా ఉండాలంటే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగం పెంచ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement