దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా వినపడలేదు.
దేశవ్యాప్తంగా స్కూళ్ల రీఓపెనింగ్ చేపట్టనున్న నేపథ్యంలో .. పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కీలకమైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రెండు కోవిడ్ టీకాలను పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జైడస్ క్యాడిలా ఇచ్చిన రిపోర్ట్‌ను డ్రగ్ రెగ్యులేటర్ పరిశీలిస్తున్నది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలపై జైడస్ కోవిడ్ టీకా ట్రయల్స్ నిర్వహించింది. ఇక భారత్ బయోటెక్ సంస్థ కూడా 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై రెండవ, మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు టీకాల ఫలితాల ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: భారీ వర్షానికి జలమయమైన దేశ రాజధాని ఢిల్లీ