అతనో సీఏ విద్యార్థి..నిత్యం పరీక్షల కోసం పుస్తకాల తో కుస్తీ పడుతుంటాడు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయని రాత్రి పగలు కష్ట పడుతూ ఉండేవాడు. ఇంతలోనే అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకింది కదా అని అలసత్వం వహించలేదు. కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఈ సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది.
బెర్హంపూర్‌కు చెందిన ఓ విద్యార్థి కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆ కొవిడ్ వార్డును గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులంగే సందర్శించారు. ఈ సమయంలో సదరు విద్యార్థి పుస్తకాలు చదువుతున్నాడు. చుట్టూ ఉన్న పుస్తకాలు, క్యాలికులేటర్ చూసి కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. విషయం ఏంటి అని ఆరా తీయగా, తాను సీఏ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాని కలెక్టర్‌కు విద్యార్థి తెలిపాడు. మొత్తానికి ఆ విద్యార్థి ఫోటోను తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు కలెక్టర్. మీ అంకితభావం మీ బాధను మరిచిపోయేలా చేస్తుందని కలెక్టర్ అన్నారు. ఆ విద్యార్థి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజనులు షేర్ చేస్తూ అభినందిస్తున్నారు.