యూపీలో ఓ ముస్లిం మతాధికారి చనిపోవడంతో వేల సంఖ్యలో ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే కరోనా కల్లోలంలోనూ అంత్యక్రియలకు వేలసంఖ్యలో హాజరుకావడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. యూపీలో కొద్దిరోజులుగా రోజుకు 20 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బదౌన్ జిల్లాకు చెందిన ముస్లిం మతాధికారి అబ్దుల్ హామీద్ మహమ్మద్ సాలిమూల్ ఖాద్రీ ఆదివారం చనిపోయారు. ఈ వార్త నిమిషాల్లోనే ఇతర రాష్ట్రాలకు చేరింది.
దీంతో ఆ మతాధికారి అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో కరోనా నిబంధలను ఉల్లంఘించి బదౌన్ జిల్లాకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలకు కేవలం 20 మందిని అనుమతించాలని ఇటీవల యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మతాధికారి అంత్యక్రియలకు పది వేల మందికి పైగా హాజరవడంతో.. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాస్కు ధరించకపోతే తొలిసారి రూ. వెయ్యి, మాస్కు ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించాలని యూపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.