Saturday, November 23, 2024

కొవిడ్‌ కలవరం.. వెలుగులోకి వచ్చిన 11 రకాల వేరియంట్లు

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ భయాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కారణంగా మరోసారి కొవిడ్‌ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులేనని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్‌ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లేనని స్పష్టం చేశాయి.

- Advertisement -

ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి. ఎయిర్‌పోర్టులు, సముద్ర పోర్టులు, సరిహద్దులలో ఉండే ల్యాండ్‌ పోర్టులలో ఈ పరీక్షలు నిర్వ#హంచినట్లు వెల్లడించాయి. మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో 124 మందికి మాత్రమే కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించాయి. 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్‌ సీక్వెన్స్‌ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్‌బీబీ, ఎక్స్‌బీబీ.1 వేరియంట్‌ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఒక శాంపిల్‌లో బీఎఫ్‌ 7.4.1 వేరియంట్‌ గుర్తించినట్లు తెలిపారు.

గత నెలలో భారతదేశం విమాన ప్రయాణీకుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా కొత్త వేరియంట్‌ను గుర్తించడానికి విమానాశ్రయాలలో యాదృచ్ఛిక పరీక్షను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టులు అందించాల్సిన అవసరం ఉంది. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌కు తగిన ప్రవర్తనపై దృష్టి మళ్లి కేంద్రీకరించింది.

కోల్‌కతా విమానాశ్రయంలో…

కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయించగా వారికి ఓమైక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఎఫ్‌ 7 వైరస్‌ సోకినట్లు నిర్ధారించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా సోకిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఓ వ్యక్తి నాడియా జిల్లాకు చెందినవారని, మరొకరు బీహార్‌కు చెందినవారని అధికారులు చెప్పారు. కాని ప్రస్తుతం వారు కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. కరోనా సోకిన నలుగురితో 33 మంది వ్యక్తులు కలిసినట్లు బెంగాల్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. రోగులను కలిసిన వారి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement