Saturday, November 23, 2024

పిల్లల చదువులపై ప్లానేంటీ…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మళ్లి విజృంభిస్తుండటంతో విద్యాశాఖ అలర్ట్‌ అయ్యింది. రానున్న నాలుగు వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ప్రణాళి కలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో కరోనా ప్రభావం విద్యారంగంపై ఏ విధంగా పడిందో అందరికీ తెలిసిందే. దాదాపు 11 నెలల వరకు ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు దూరమవగా, రెండో అకాడ మిక్‌ ఇయర్‌లో సరిగ్గా క్లాసులు వినకుండానే పై తరగతులకు వెళ్లారు. ఈ క్రమంలో గత ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ అనుభవాల నుంచి ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌ వస్తున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు రచించాలనే దానిపై విద్యాశాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 2 వేలకు పైగా నమోదవుతోంది.

ఈ విషయాన్ని ముందే పసిగట్టి అలర్ట్‌ అయిన ప్రభుత్వం… వైద్యారోగ్య శాఖ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. లేకుంటే విద్యా సంస్థలకు సెలవులను షెడ్యూల్‌ ప్రకారం కాస్త ఆలస్యంగా ఇచ్చివుంటే విద్యార్థులు కరోనా బారినపడే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత కేసులు మరింతగా పెరిగితే ఏం చేయాలనే దానిపై అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ థర్డ్‌ వేవ్‌ పీక్‌ స్టేజ్‌కి వెళ్తే ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

తల్లిదండ్రుల్లో మళ్లి అదే భయం…
2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క నెల ప్రత్యక్ష తరగతులు జరగ్గా, మిగతా క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి. దీంతో విద్యా ర్థుల చదువుల్లో తీవ్ర మార్పులొచ్చాయి. గతంలో పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారు సైతం కొన్ని సబ్జెక్టుల్లో చదవడం, రాయడం మర్చిపోయారు. ఆ తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక 2021-22 విద్యా సంవత్సరంలో జులైలో ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసులు ప్రారంభం కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. అయినా కానీ కరోనా భయంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అప్పట్లో విద్యార్థుల తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపించలేదు. క్రమంగా జిల్లాల్లో కేసులు జీరోకి పడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద కేసుల వరకే నమోదవడంతో విద్యావ్యవస్థ గాడిలో పడింది. ఈలోపే కేసులు ఎక్కువయ్యాయి. కరోనా కారణంగా మళ్లి స్కూళ్లు మూతపడే పరిస్థితి తలెత్తడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మళ్లి భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవానికి చాలా మంది సంక్రాంతి సెలవులకు రెండు మూడ్రోజుల ముందు నుంచే తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లోనూ ఉంటే విద్యార్థులను విద్యాసంస్థలకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు మరింత అలర్టయ్యారు. పండగ సెలవుల తర్వాత ఆఫ్‌లైన్‌ క్లాసులతో పాటు ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసులనూ నడిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ పాఠాలు?
ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం సంక్రాంతి సెలవులు ఈనెల 11 నుంచి పాఠశాలలకు, 13 నుంచి కళాశాలలకు ఇవ్వాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యం లో ఈనెల 8 నుంచే ప్రభుత్వం సెలవులు ఇచ్చేసింది. దాంతో విద్యా సంస్థలు తిరిగి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ రాష్ట్రంలో కరోనా కేసులు కొన్ని రోజులుగా నమోదైన వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈనెల 2వ తేదీన 274 కొత్తగా కరోనా కేసులు నమోదైతే ఈనెల 3న 482, 4న 1052, 5న 1520, 6న 1913, 7న 2295, 8న 2606గా నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. దీంతో రానున్న రోజుల్లో పాజిటివిటీ రేటు రాష్ట్రంలో ఇలానే ఉంటే ఈనెల 17 నుంచి పున:ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దాంతో మరికొన్ని రోజులు సెలవులను పొడిగించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇంటర్‌ విద్యార్థులకు 15 రోజుల ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసుల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. రానున్న రోజుల్లో పాఠశాలల, యూనివర్సిటీ విద్యార్థులకు సైతం ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసులతో పాటు ప్రత్యక్ష తరగతులకూ అనుమతులు ఇచ్చే అవకాశం లేకపోలేదని ప్రస్తుత పరిస్థితుల రిత్య స్పష్టమవుతోంది. ఈనేపథ్యంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement