ఆంధ్రప్రభ దినపత్రిక ప్రత్యేక కథనం
దేశంలో పెరుగుతున్న కుబేరుల సంఖ్య
మరోవైపు నిరుపేదల ఆకలి కేక
భిన్న ధృక్కోణాల ఆర్థిక వ్యవస్థగా భారత్
మారుతున్న ప్రభుత్వాల ప్రాధాన్యతలు
జనం జీవన ప్రమాణాల పెంపునకు కృషి
వివిధ పథకాలతో నేరుగా ప్రజలకు లబ్ధి
అంతరాల తొలగింపే లక్ష్యం
పేదరిక నిర్మూలనే ధ్యేయం
ప్రభుత్వాల పనితీరుపై నిపుణుల విశ్లేషణ
పెరిగిన ఆదాయాన్ని, సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమాణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడుతున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యాసాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటీష్ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులోకొచ్చాక భారత్ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్ ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగంలోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేందుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు.. దాన్ని సక్రమంగా పంపిణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేకప్రతినిధి – ప్రపంచ సైనిక శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారత్ నుంచి ప్రపంచ కుబేరుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కరోనా కల్లోలంలో కూడా భారతీయ కార్పొరేట్లు అదనంగా ట్రిలియన్ల డాలర్లను పోగేశారు. అంబానీలు, అదానీలు ప్రపంచ మార్కెట్లను సైతం శాసించగలిగే స్థాయికెదిగారు. ముఖేష్ అంబానీ ఒక సెకన్ కాల వ్యవధిలో సంపాదించే అదా యం సగటు వ్యక్తి మూడేళ్ళ పాటు కష్టపడితే వచ్చే మొత్తానికి సమానమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. కానీ జియో లు, రిలయన్స్‌లు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో లక్షల కోట్ల వ్యాపారం పెరిగింది. ఆఖరకు ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు కూడా అంతర్జాలం కోసం కార్పొరేట్ సంస్థలకు భారీగా చెల్లింపులు జరపక తప్పలేదు. మరోవైపు ప్రపంచ పేదల్లో 60శాతం మంది పేదలు భారత్‌లోనే ఉన్నారు.
ఒక్క 2020లో కోవిడ్ మహమ్మారి కొత్తగా ఏడున్నర కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేసింది. వీరి కుటుంబ రోజువారి ఆదాయం రోజుకు వంద రూపాయాల లోపే. దేశంలో ఒక పూట మాత్రమే ఆహారం తింటున్న వారి సంఖ్య 13.40కోట్లకు చేరింది.
ఇది పరస్పర భిన్న దృక్కోణాలు కలిగిన భారత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. ఓ వైపు దేశంలో సంపద పెరిగిం ది. కోవిడ్ కారణంగా కనీసం ఐదారేళ్ళ పాటు తిరిగి భారత ఆర్థికవ్యవస్థ కోలుకోలేదన్న అంచనాలు పటాపంచలయ్యా యి. ఏడాది తిరగకముందే ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజు కుంది. పరిశ్రమలు, వ్యాపారాలు పునరుద్దరణకు నోచుకున్నా యి. ప్రభుత్వాలకు పన్ను వసూళ్ళు అనూహ్యంగా పెరిగాయి. అయితే దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా వైద్యం ప్రైవేటు, కార్పొరేట్ రంగంలో బందీ అయింది. ప్రభుత్వ దవా ఖానాలు నామమాత్రం గానే సేవలంది స్తున్నాయి. ఉన్నత విద్యావకాశాలు ప్రైవేటు రంగానికే పరిమితమయ్యా యి. దీంతో జనం జీవన ప్రమాణాలు పెరగడంలేదు. పెరుగుతున్న సదుపా యాలన్నీ ఉన్నత వర్గాలకు, ప్రభుత్వో ద్యోగులకే పరిమితమౌతున్నాయి.
తాజాగా కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రజల ముందు చేదు నిజాల నుంచింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్య, వైద్యాలు పూర్తిగా ప్రభు త్వ నియంత్రణలో ఉంటున్నాయి. లేదా ప్రభుత్వమే ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. అదీకాకుంటే ప్రభుత్వం వైద్య బీమా కల్పిస్తోంది.
భారత్‌లో ఇంకా వైద్య బీమా విస్తృత పరిధిలోకి రాలేదు. కేవ లం ఉన్నత వర్గాలకే ఇది అందుబాటులో ఉంది. దీంతో 70 శాతం పైగా ప్రజలు ఆధునిక వైద్యానికి నోచుకోలేక పోతున్నారు.
వైద్యంపై ప్రభుత్వం జీడీపీలో మూడు శాతం ఖర్చు పెట్టాల న్న నిబంధన ఉంది. ప్రస్తుతం అది 1.2శాతంగానే ఉంటోంది. దీన్ని మూడు శాతానికి పెంచితే ప్రజలు తమ చేతి నుంచి ఆరొ గ్యంపై చేసే వ్యయంలో 60శాతం తగ్గుతుందని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా తమ ప్రాధాన్యతల్ని సవరించుకుంటున్నాయి. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగం కీలకంగా ఉంది. మౌలిక సదుపాయాల నుంచి పరిశ్రమలపై ప్రభుత్వాలు, పెట్టుబడులు పెట్టి నిర్వహణ చేపట్టాయి. లాభనష్టాల్ని ప్రభుత్వాలు భరించేవి. రాన్రాను దేశంలో ప్రైవేటు రంగం వేళ్ళూనుకుంది. ప్రస్తుతం అది విస్తరించింది. దీంతో అంచెలంచెలుగా ప్రభుత్వం ఒక్కో బాధ్యతను వదిలించుకుంటోంది. ప్రైవేటు రంగానికి అప్పజెబుతోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పనా రంగం దాదాపుగా ప్రైవేటు పరిధిలోకొచ్చేసింది. తాజాగా పరిశ్రమల్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని నీతిఅయోగ్ సూచించింది. దీంతో అభివృద్ధి మొత్తం ప్రైవేటు రంగంలోనే ముందుకు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వం నయాపైసా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా నిర్వహణ వ్యయం పేరిట ప్రైవేటు సంస్థలు చేపట్టే వసూళ్ళలో రాయల్టిdగా ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం కూడా లభిస్తుంది. ఈ దశలో ప్రభుత్వాలు ఇక పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టేందుకు వీలేర్పడుతుంది.
ఒకప్పుడు వేల కోట్లలో ఉన్న రాష్ట్రాల బడ్జెట్ ఇప్పుడు లక్షల కోట్లు దాటేసింది. ఇక కేంద్ర బడ్జెట్ అయితే గత పదేళ్ళలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదే సమయంలో అభివృద్ధిపై వెచ్చించాల్సిన వ్యయం తగ్గిపోయింది.
దీంతో పెరిగిన ఆదాయం, సంపదల్ని పేదల జీవన ప్రమాణాల మెరుగుకు వినియోగించేందుకు ప్రభుత్వాలు సమాయత్తమౌ తున్నాయి. ఇందులో భాగంగా నేరుగా నగదునే ప్రజల ఖాతాల్లోకి మళ్ళించే ప్రణాళికల్ని అమల్లోకి తెస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లోకొచ్చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ నేడో రేపో అమలుకు సిద్ధమౌతుంది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో ప్రధాన పార్టీలన్నీ సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలౌతున్న సంక్షేమాన్ని తామధికారంలోకొస్తే అమల్లోకి తెస్తామంటూ హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి రైతులకు రుణమాఫీ, మహిళలకు నేరుగా వారి ఖాతాల్లో నెలవారీ నగదు, వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఆర్ధిక ఆసరా. వీటితో పాటు మహిళలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యాబోధన. ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం, ఉండేందుకు ఇల్లు, వంటి పథకాలకివి ప్రాధాన్యతనిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఉద్యోగులు కూడా ఊహించని స్థాయిలో పెంపును ప్రతిపాదించింది. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం, సర్వీస్ ప్రయోజనాల్ని మరింత విస్తృతపర్చడం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నామమాత్రపు ధరపై ఆహార ధాన్యాల సరఫరా కొనసాగుతోంది. కేవలం పది రూపాయల నామమాత్రపు ఫీజుతోనే అత్యాధునిక వైద్యాన్ని అందించే అఖిల భారత వైద్య శాస్త్ర సంస్థల్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రం నెలకొల్పుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలను కొత్తగా ఏర్పాటు చేస్తోంది. ప్రజలందరిని ఆరోగ్య బీమా పరిధిలోకి తెస్తోంది. విద్యార్థులకు చిన్నారులకు పౌష్టికాహార పథకాన్ని అమలు చేస్తోంది.