Tuesday, November 26, 2024

రికార్డులు దాటేస్తున్న కొవిడ్ కేసులు.. థ‌ర్డ్ వేవ్ కు సంకేతాలేనా..?

దేశంలో రోజువారీ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా 10 వేలకు దిగువనే నమోదవుతోన్న కేసులు బుధవారం అనూహ్యంగా 13వేల మార్కును దాటేశాయి. తద్వారా 33 రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. అదే సమయంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 961కి చేరుకుంది. వీరిలో 320 మంది కోలుకున్నారు. ఢిల్లి(263), మహారాష్ట్ర (252)లోనే సగానికిపైగా కేసులున్నాయి. మొత్తం 22 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ వ్యాపించింది. తాజాగా 11,99,252 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 13,154 మందికి పాజిటివ్‌గా చేరింది. ప్రస్తుతం 82,402 (0.24 శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 7,486 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.48 కోట్ల మందికి కరోనా బారినపడగా, రికవరీలు 3.42కోట్ల (98.38 శాతం)కు చేరాయి. మరో 268 మంది మరణించారు. దీంతో కొవిడ్‌ మరణాలు 4,80,860 కి చేరాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 143 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

దేశంలో కొవిడ్‌ కేసుల్లో ఆకస్మిక పెరుగుదల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. డిసెంబర్‌ 26 నుండి, భారతదేశంలో రోజువారీ కోవిడ్‌ సంఖ్య పెరుగుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం తెలిపారు. ఢిల్లి తోపాటు ముంబై, పూణ, థానే, బెంగళూరు, చెన్నై, గుర్గావ్‌, అహ్మదాబాద్‌, నాసిక్‌లలో పాజిటివిటీలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కోవిడ్‌-19 పరిస్థితిపై మంత్రిత్వ శాఖ వారపు విలేకరుల సమావేశం నిర్వహించింది. ఆందోళనకర పరిస్థితులున్న ఎనిమిది రాష్ట్రాల్లోని జిల్లాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అత్యధిక సంఖ్యలో యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలోని ఎనిమిది జిల్లాలు వారానికి 10శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటును నివేదిస్తున్నాయి. వాటిలో ఆరు మిజోరంలోను, అరుణాచల్‌, పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా)లో ఒక్కొక్కటివున్నాయి. 5-10శాతం మధ్య పాజిటివిటీ రేటు 14 జిల్లాల్లో నివేదించబడింది. ఈ జాబితాలో కేరళలో 6, మిజోరంలో 4, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, జార్ఖండ్‌, మణిపూర్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయని అగర్వాల్‌ వెల్లడించారు. టీకా తర్వాత రోగనిరోధక శక్తి 9 నెలలు కొనసాగు తుందని ఎయిమ్స్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన మాత్ర మోల్నుపిరవిర్‌ను ఆప్టిమస్‌ ఫార్మా గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. మోల్నుపిరవిర్‌ ఒక యాంటీవైరల్‌. ఇది వైరల్‌ మ్యూటాజెనిసిస్‌ ద్వారా వైరస్‌ పునరుత్పత్తిని నిరోధిస్తుంది. ఈ మాత్రలు 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వవచ్చు. ఒక వ్యక్తికి కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలితే, అతను/ఆమె చికిత్సను పూర్తి చేయడానికి 5 రోజుల పాటు రెండు 800 మిల్లిd గ్రాముల టాబ్లెట్‌లను తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో మాత్ర ధర 63 రూపాయలుగా నిర్ధారించబడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement