Tuesday, November 26, 2024

విశాఖలో అంతే.. మాస్క్ మర్చిపోతే వాళ్లు వదలరు!!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల ఎస్పీలకు ఏపీ డీజీపీ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీ తెలిపారు. మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానా విధించాలన్నారు. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యేవారిని వదిలి పెట్టొద్దని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియ్‌సగా ఉన్నాయి. పోలీసులు కూడా అంతే శ్రద్ధగా పనిచేయాలని అన్నారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కరోనా విస్తరణ, నియంత్రణ చర్యలపై వరుస సమీక్షలు చేస్తున్న సవాంగ్‌.. ఆదివారం జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మాస్క్‌లు లేకుండా బయటకు ఎవరొచ్చినా జరిమానా విధించకుండా వదిలి పెట్టొద్దని ఆదేశించారు. ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చెంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, మాస్క్‌ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కాగా, పోలీసులు చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కోసమేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతి కొద్ది మంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   

కాగా మాస్క్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 18,565 మందికి ఒక్క రోజులో రూ.17.34 లక్షల ఫైన్‌ విధించారు. మాస్క్‌ లేని వారికి రూ.250కి తగ్గకుండా జరిమానా విధించారు.రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,327 మందికి ఫైన్‌ విధించగా తర్వాతి స్థానంలో ప్రకాశం 2,294, విజయవాడ సిటీ 2,106 చలానాలు రాశారు. అతి తక్కువగావిజయనగరంలో కేవలం 78 మందికి ఫైన్‌ విధించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement