కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ కోసం ఆవుదూడ ద్రవాలను సేకరించేందుకు వాటిని నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపడంతో కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. కోవాగ్జిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నది. కోవాగ్జిన్ కోసం ఆవులను చంపుతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ ఆరోపించడంతో వివాదం రాజుకున్నది. లేగదూడ ద్రవాలను వీరో కణాల అభృద్ధి కోసం వినియోగిస్తున్నారని కేంద్రం వివరించింది.
వీరో కణాల అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఆవులు, ఇతర జంతువుల ద్రవాలను వినియోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో జీవకణాల అభివృద్ధి కోసం వీరో కణాలు వాడుతున్నారు. ఇదే విధానాన్ని గత కొన్ని దశాబ్ధాలుగా వ్యాక్సిన్ తయారీలో పాటిస్తున్నారు. పోలియో, రేబిస్, ఇన్ ఫ్లుయంజా వ్యాక్సిన్లు ఇలాగే తయారవుతున్నాయి.దూడల ద్రవాలను వేరుచేసే ప్రక్రియలో భాగంగా అనేకసార్లు వీరో కణాలను శుద్ధి చేస్తారు. ఆ తరువాత వీరో కణాలతో కరోనా వైరస్ ను ఇన్ ఫెక్ట్ చేసి, వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారు. ఇలా చేసే క్రమంలో వీరో కణాలను పూర్తిగా నాశనం చేసి, చనిపోయిన వైరస్ తోనే వ్యాక్సిన్ తయారవుతుందని కేంద్రం వెల్లడించింది. కోవాగ్జిన్ లో లేగదూడ ద్రవం ఉండదని, ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.