Friday, November 22, 2024

రాజకీయాలకు కోర్టులు వేదికలు కారాదు.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ వివాదాల కేసుల్లో న్యాయస్థానాలను వేదిక చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించిన కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి అలియాస్ వీకే సతీశ్ శర్మ, సింహయాజి స్వామి, నందు కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించగా, రెండ్రోజుల వ్యవధిలో హైకోర్టు పూర్తి భిన్నమైన తీర్పునిచ్చిందని పిటిషన్లో ప్రస్తావించారు.

ఇదే విషయంపై గత విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అలా ఎలా భిన్నమైన తీర్పునిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సోమవారం నాటి విచారణ విచారణ సందర్భంగా నిందితుల బెయిల్ పిటిషన్లు కింది కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం బెంచ్ ముందు విచారణకొచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలు, ప్రతీకార రాజకీయాల్లోకి న్యాయస్థానాలను లాగుతున్నారంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement