ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై దేశవ్యాప్తంగా సంబరం వెల్లివిరుస్తోంది. ఎలాంటి అపాయం లేకుండా 41 మంది కార్మికులు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్మికులను ఫోన్‌లో పరామర్శించారు.
మరోవైపు సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను రక్షించేందుకు 17 రోజులపాటు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన సిబ్బందిపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన వెంటనే ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. మానవత్వానికి, టీమ్ కృషికి ఈ రెస్క్యూ ఆపరేషన్ అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని అభినందించారు. ‘‘ ఉత్తరకాశీలో మన సోదరుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను చెప్పాలనుకుంటున్నాను. మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.